Guntur District: గుంటూరు జిల్లాలో ఘోరం.. పెళ్లికి నిరాకరించిన బాలికపై కర్రలతో యువకుడి దాడి

Young man attacked girl and their family members for refused to marry her
  • ఫిరంగిపురంలో ఘటన
  • బాలికకు కుదిరిన సంబంధం
  • తానే పెళ్లి చేసుకుంటానంటూ ఇబ్బంది పెట్టిన యువకుడు
  • మాట్లాడుకుని పరిష్కరించుకునేందుకు సమావేశమైన ఇరు కుటుంబాలు
  • పెద్దలు కుదిర్చిన సంబంధాన్నే చేసుకుంటానన్న బాలిక
  • దాడిలో బాాలిక సహా 11 మందికి గాయాలు
తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు, అతడి బంధువులు చెలరేగిపోయారు. కర్రలు, రాళ్లతో బాలిక, ఆమె బంధువులపై దాడిచేశారు. ఈ ఘటనలో బాలిక సహా 11 మంది గాయపడ్డారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు వివాహం నిశ్చయమైంది. అయితే, అదే గ్రామంలోని ప్రకాశం పంతులు వీధికి చెందిన మణికంఠ (23) బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఇబ్బంది పెట్టేవాడు. ఇలా కాదని, మాట్లాడుకుని పరిష్కరించుకుందామని చెప్పి ఇరు కుటుంబాలు సమావేశమయ్యాయి. 

అయితే, బాలిక మాత్రం మణికంఠను చేసుకునేందుకు నిరాకరించింది. పెద్దలు కుదిర్చిన వివాహాన్నే చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో అది ఉద్రిక్తతకు దారితీసింది. ఆపై మణికంఠ, అతడి బంధువులు బాలిక, ఆమె కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఈ ఘటనలో బాలిక సహా 11 మంది గాయపడ్డారు. వీరిలో 9 మందిని నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన బాలిక, ఆమె బంధువును గుంటూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. మణికంఠ తరపు బంధువుల్లో ఒకరికి గాయమైనట్టు పోలీసులు తెలిపారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Guntur District
Crime News
Phirangipuram
Andhra Pradesh

More Telugu News