Girls: కొత్తపల్లి హైస్కూల్లో వింత సమస్య... పాఠశాలకు వెళ్లి కుప్పకూలుతున్న విద్యార్థినులు

  • నేడు స్పెషల్ క్లాసుకు వెళ్లిన విద్యార్థినులు
  • కుప్పకూలిన ఏడుగురు బాలికలు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • 20 రోజుల కిందట ఓ బాలిక ఇదే రీతిలో అస్వస్థతకు గురైన వైనం
Girl students collapsed frequently in U Kothapalli high school

నేడు కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి హైస్కూల్లో స్పెషల్ క్లాసు కోసం వెళ్లిన ఏడుగురు విద్యార్థినులు కుప్పకూలిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఇక్కడి విద్యార్థినులు ఉన్నట్టుండి కుప్పకూలడం ఇదే తొలిసారి కాదు. ఇరవై రోజుల కిందట ఓ బాలిక ఇలాగే కళ్లు తిరిగి పడిపోయింది. గత రాత్రి కూడా పలువురు విద్యార్థినులు ఇలాగే అస్వస్థతకు గురయ్యారు. నేడు ఏకంగా ఏడుగురు విద్యార్థినులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విద్యార్థినులు ఈవిధంగా కళ్లు తిరిగి పడిపోతుండడం ఒక మిస్టరీగా మారింది. దాంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.  

దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్పందించారు. యు.కొత్తపల్లి హైస్కూల్ ను పరిశీలించాలని పొల్యూషన్ విభాగం సిబ్బందిని ఆదేశించారు. ఆయుష్ కమిషనర్ రాములు కూడా స్పందించి, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. పాఠశాలకు వెళ్లిన ఆయుష్ సిబ్బంది అక్కడి పరిస్థితులను గమనించారు. కాగా, ఈ నెల 25, 26 తేదీల్లో పాఠశాలలో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 

విద్యార్థినులు కుప్పకూలిన ఘటన సమాచారం తెలుసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. 

అయితే, ఏడుగురు బాలికలకు ఒకే ఆక్సిజన్ కిట్ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యార్థినులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, అధికారులు బాలికలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News