Telangana: నార్సింగి వద్ద రూ.1 కోటి సీజ్... పరారీలో కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి

hyderabad police sieze 1 crore cash which is going to munugode
  • మణికొండ పరిధిలోని నార్సింగి వద్ద ఘటన
  • మణికొండ నుంచి మునుగోడుకు రూ.1 కోటి తరలించే యత్నం
  • నార్సింగి రోటరీ వద్ద కారును పట్టుకున్న పోలీసులు
  • నగదుతో పాటు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • విచారణలో వెలుగులోకి వచ్చిన కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డిల పేర్లు
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల నోట్ల కట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు,. తాజాగా శనివారం మణికొండ పరిధిలోని నార్సింగి వద్ద మరో రూ.1 కోటి నగదును సీజ్ చేశారు. ఈ ఘటనలో సంబంధం ఉందని భావిస్తున్న కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. వీరితో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... మణికొండలోని ఓ విల్లా నుంచి రూ.1 కోటి నగదును మునుగోడులో ఉన్న సుమంత్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డిలకు అందజేసేందుకు నలుగురు వ్యక్తులు కారులో బయలుదేరారు. నార్సింగి రోటరీ వద్దకు రాగానే పోలీసులు కనిపించడంతో వీరు కారు వేగాన్ని పెంచారు. దీంతో అనుమానించిన పోలీసులు వీరిని వెంబడించి మరీ కారును పట్టుకున్నారు. కారును సోదా చేయగా... అందులో రూ.1 కోటి నగదు బయటపడింది. నగదుతో పాటు కారులోని నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా... సుమంత్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిల పేర్లు వెలుగుచూశాయి.
Telangana
Hyderabad
Munugode
Hyderabad Police
Manikonda

More Telugu News