England: టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ శుభారంభం

  • పెర్త్ లో ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 5 వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేసర్ శామ్ కరన్
  • 112 పరుగులకు ఆఫ్ఘన్ ఆలౌట్
  • 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్
England makes good start in T20 World Cup by beating Afghanistan

పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత బలమైన జట్టుగా ముద్రపడిన ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ లో శుభారంభం చేసింది. సూపర్-12 దశలో భాగంగా... పెర్త్ లో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 

తొలుత శామ్ కరన్ (5 వికెట్లు) నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆఫ్ఘన్ ను 19.4 ఓవర్లలో 112 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లండ్... ఆపై 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో లియామ్ లివింగ్ స్టన్ 29 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 18, ఓపెనర్ అలెక్స్ హేల్స్ 19, డేవిడ్ మలాన్ 18 పరుగులు చేశారు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కేవలం 2 పరుగులే చేసి నబీ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. 

అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఎడమచేతి వాటం పేసర్ శామ్ కరన్ పిచ్ పరిస్థితులను ఉపయోగించుకుని ఆఫ్ఘన్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. 3.4 ఓవర్లు బౌలింగ్ చేసిన కరన్ కేవలం 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం మ్యాచ్ లో హైలైట్ గా నిలిచింది. 

ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 2, మార్క్ ఉడ్ 2, క్రిస్ వోక్స్ 1 వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ లో ఇబ్రహీం జాద్రాన్ 32, ఉస్మాన్ ఘనీ 30 పరుగులు చేశారు.

More Telugu News