Helicopter: అరుణాచల్ ప్రదేశ్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో ఐదో మృతదేహం కూడా వెలికితీత

  • అరుణాచల్ ప్రదేశ్ లో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్
  • ఐదుగురి మృతి
  • మృతదేహాల వెలికితీత నేటితో పూర్తి
  • రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందన్న ఆర్మీ
Fifth dead body found in army chopper crash

అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో పర్వత ప్రాంతాల్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశం దట్టమైన అడవుల్లో ఉండడంతో అక్కడికి చేరుకోవడానికి సహాయక బృందాలకు చాలా సమయం పట్టింది. హెలికాప్టర్ నిన్న కూలిపోగా, అందులోని మృతదేహాల వెలికితీత ఇవాళ్టికి పూర్తయింది. 

ఈ ఘటనకు సంబంధించి చివరిదైన ఐదో మృతదేహాన్ని కూడా గుర్తించి, వెలికితీశామని, ఈ ఆపరేషన్ ఇంతటితో ముగిసిందని రక్షణ మంత్రిత్వ శాఖ పీఆర్వో వెల్లడించారు. ఈ హెచ్ఏఎల్ రుద్ర హెలికాప్టర్ లో ఇద్దరు పైలెట్లు, ముగ్గురు సైనిక సిబ్బంది ఉన్నారు. మృతులను మేజర్ వికాస్ భంభు, మేజర్ ముస్తఫా బొహరా, సీఎఫ్ఎన్ టెక్ ఏవీఎన్ అశ్విన్ కేవీ, హవల్దార్ బీరేష్ సిన్హా, ఎన్కే (ఓపీఆర్) రోహితాశ్వ కుమార్ లుగా గుర్తించారు. 

కాగా, హెలికాప్టర్ లో లోపం తలెత్తిన వెంటనే పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సందేశం పంపారని వెల్లడైంది. దీనిపై అధికారులు ఎలా స్పందించారన్న దానిపై ఇప్పుడు శాఖాపరమైన విచారణ చేపట్టనున్నారు. 

హెలికాప్టర్ గాల్లోకి లేచిన సమయంలో గగనవిహారానికి వాతావరణం అనుకూలంగానే ఉందని, పైగా ఆ పైలెట్లు అడ్వాన్డ్స్ లైట్ హెలికాప్టర్ పై 600 ఫ్లయింగ్ అవర్స్ ను, 1800 సర్వీస్ ఫ్లైయింగ్ అవర్స్ ను పూర్తిచేసుకున్న అనుభవజ్ఞులని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. 

ప్రమాదంలో కూలిపోయిన రుద్ర హెలికాప్టర్ ను సైన్యం అటాకింగ్ హెలికాప్టర్ గా ఉపయోగిస్తోంది. దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రూపొందించింది. ఇది ధృవ్ అడ్వాన్స్ డ్ లైట్ హెలికాప్టర్ కు ఎంకే-4 వెర్షన్. 

నిన్న లికాబాలి పట్టణం నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి రోడ్డు మార్గం లేకపోవడంతో ఇతర హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

More Telugu News