Traffic Fines: సిగ్నల్ జంప్ చేస్తే గుజరాత్ లో పూలతో సత్కారం

  • వారంపాటు జరిమానా విధించబోమని ప్రకటించిన మంత్రి
  • దీపావళి సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం
  • ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ రూల్స్ పాటించేందుకు ప్రోత్సాహం
  • ప్రభుత్వ ప్రకటనపై నెటిజన్లలో మిశ్రమ స్పందన
No Fine For Traffic Violations In Gujarat Because of Diwali

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో జరిమానా కట్టాలి.. పోలీసులు గమనిస్తే అక్కడికక్కడే జరిమానా చెల్లించాల్సిందే. కానీ సిగ్నల్ జంప్ చేసినా పోలీసులు జరిమానా వేయకుండా మన చేతికి ఓ పువ్వు అందిస్తే.. మరోసారి సిగ్నల్ జంప్ చేయొద్దని సున్నితంగా చెపితే ఎలా ఉంటుంది?.. ఇలా చేయడం వల్ల కొంతమందైనా తప్పకుండా మారతారని గుజరాత్ ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.

అందుకే రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలకు బదులు ఇలా పూలను అందించి మర్యాదగా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. దీపావళి సందర్భంగా ఓ వారం రోజులు ఈ నిర్ణయాన్ని అమలుచేసి చూడనున్నట్లు రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ దీపావళికి ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ తీసుకున్న మరో ప్రజానుకూల నిర్ణయమిదని చెప్పారు. త్వరలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల మనసులు గెలుచుకునేందుకు ఈ కొత్త రూల్ తీసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మంత్రి ట్వీట్ పై నెటిజన్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. జరిమానాల ఉద్దేశం కూడా జనం ట్రాఫిక్ రూల్స్ పాటించడమేనని, దానికి ప్రత్యామ్నాయంగా ఇలా పూలతో విజ్ఞప్తి చేయడం మంచి ఆలోచన అంటూ కొంతమంది ట్వీట్ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా రూల్స్ పాటించేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. మరికొంతమంది మాత్రం భారీగా విధించే జరిమానాల భయంతోనే చాలామంది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేందుకు సాహసించరని గుర్తుచేస్తున్నారు. జరిమానాలే విధించబోమని చెబితే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతుందని, ప్రమాదాలు పెరుగుతాయని విమర్శిస్తున్నారు.

More Telugu News