Krishna District: కృష్ణా జిల్లాలో గంజాయి బ్యాచ్ దారుణం.. యువకుడిని బంధించి యువతిపై అత్యాచార యత్నం

Ganja batch Tied young man and try to rape girl in krishna Dist
  • ప్రేమ జంటను ఆటోలో వెంబడించిన గంజాయి ముఠా
  • యువకుడిని తాళ్లతో కట్టి యువతిపై అఘాయిత్య యత్నం
  • యువతి కేకలతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు
  • నిందితుల ఆటోలో గంజాయి లభ్యం 
కృష్ణా జిల్లాలో ఓ గంజాయి బ్యాచ్ చెలరేగిపోయింది. ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడపడం చూసిన నిందితులు యువకుడిని బంధించి యువతిపై అత్యాచారానికి యత్నించారు. గన్నవరం మండలం ముస్తాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రేమ జంట నిర్మానుష్య ప్రదేశం వైపు వెళ్తుండడాన్ని గమనించిన నిందితులు ఆటోలో వారిని వెంబడించారు. అనంతరం యువకుడిని పట్టుకుని తాళ్లతో బంధించారు. ఆపై యువతిపై అత్యాచారానికి యత్నించారు. 

యువతి గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంబడించి వారిలో ఒకరిని పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుల ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో గంజాయి ఉండడాన్ని గమనించారు. దీంతో వారు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ జంటను ఆసుపత్రికి తరలించారు.
Krishna District
Gannavaram
Ganja Batch
Love Couple

More Telugu News