Google: సీసీఐ భారీ జరిమానా విధించడంపై గూగుల్ స్పందన

  • గూగుల్ పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆగ్రహం
  • భారత్ లో గుత్తాధిపత్య ధోరణి అవలంబిస్తోందని ఆరోపణ
  • రూ.1,338 కోట్ల భారీ జరిమానా విధింపు
  • సీసీఐ నిర్ణయాన్ని పరిశీలిస్తామన్న గూగుల్
Google reacts to CCI fine

భారత్ లో గుత్తాధిపత్య ధోరణులు అవలంబిస్తోందన్న కారణంతో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.1,338 కోట్ల భారీ జరిమానా విధించడం తెలిసిందే. ఆండ్రాయిడ్ ఓఎస్ విధివిధానాలపై గూగుల్ తన దృక్పథాన్ని మార్చుకోవాలని ఆదేశించిన సీసీఐ, స్మార్ట్ ఫోన్ తయారీదారులతో గూగుల్ ఆదాయ పంపకం ఒప్పందాలపై ఆంక్షలు విధించింది.

దీనిపై గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఐఎన్సీ స్పందించింది. సీసీఐ విధించిన జరిమానాతో భారత్ లోని తమ వినియోగదారులు, వ్యాపారాలకు తీవ్ర విఘాతం కలిగిందని పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ఆండ్రాయిడ్ అనేక అవకాశాలు కల్పిస్తోందని, భారత్ లోనూ, మిగతా ప్రపంచదేశాల్లోనూ వేల సంఖ్యలో వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తోందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. 

సీసీఐ నిర్ణయంతో... భారత్ లో మొబైల్ ఫోన్ల ధరలకు రెక్కలొస్తాయని, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫీచర్లను విశ్వసించేవారు ఇకపై తీవ్రస్థాయిలో భద్రతా పరమైన సమస్యలు ఎదుర్కొనే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీసీఐ నిర్ణయాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

More Telugu News