డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమరావతి రైతుల యాత్రను అడ్డుకున్న పోలీసులు.. వాగ్వివాదం
- కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
- పసలపూడి వద్ద యాత్రను అడ్డుకున్న పోలీసులు
- ఐడీ కార్లులు చూపించి ముందుకు కదలాలని ఆదేశం
- పోలీసులు, రైతుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం
- ఐకాస నేతలను ఈడ్చి పడేసిన పోలీసులు
- తలకు గాయంతో సొమ్మసిల్లిపడిపోయిన మహిళా రైతు
హైకోర్టు అనుమతులతోనే యాత్ర చేస్తున్నామని రైతులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ సందర్భంగా ముందుకు కదిలేందుకు రైతులు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే భారీ సంఖ్యలో పోలీసు బలగాలను అక్కడ మోహరించిన ఉన్నతాధికారులు... రైతులను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. ఒకానొక సందర్భంలో రైతులపై పోలీసులు చేయి చేసుకున్నట్లుగా పలు టీవీ ఛానెళ్లు విజువల్స్ చూపించాయి. తమతో వాదించేందుకు యత్నించిన ఐకాస నేతలను పోలీసులు ఈడ్చి పడేశారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు తలకు గాయం కాగా... ఆమె అక్కడే సొమ్మసిల్లిపడిపోయారు. మొత్తంగా అక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి. చాలాసేపటి తర్వాత యాత్ర ముందుకు కదిలింది.