Junior Doctors: ఏపీలో జూనియర్ డాక్టర్లకు శుభవార్త... స్టయిఫండ్ పెంచిన ప్రభుత్వం

AP Govt hikes stipend for junior doctors
  • సమ్మె నోటీసులు ఇచ్చిన జూడాలు
  • స్టయిఫండ్ 42 శాతానికి పెంచాలని డిమాండ్
  • ఇతర రాష్ట్రాల్లో స్టయిఫండ్ ఎక్కువ ఇస్తున్నారని వెల్లడి
  • ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన
స్టయిఫండ్ పెంచకపోతే సమ్మెకు దిగుతామంటూ ఏపీలో జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి నోటీసులు పంపడం తెలిసిందే. ప్రస్తుతం చెల్లిస్తున్న స్టయిఫండ్ ను 42 శాతానికి పెంచాల్సిందేనని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టయిఫండ్ పెంపుపై జూనియర్ డాక్టర్లకు శుభవార్త చెప్పింది. 

ఎంబీబీఎస్ ఇంటర్నీస్ స్టయిఫండ్ ను రూ.19,589 నుంచి రూ.22,527కి పెంచారు. పీజీ మూడో సంవత్సరం మెడికోలకు రూ.46,524 నుంచి రూ.56,319కి పెంచారు. ఎండీ ఫైనలియర్ వారికి రూ.48,973 నుంచి రూ.56,319కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

అంతకుముందు, జూడాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇస్తూ, తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 27 నుంచి ఎమర్జెన్సీ సేవలు మినహా, మిగిలిన అన్ని వైద్యసేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్టయింది.
Junior Doctors
Stipend
AP Govt

More Telugu News