IMD: ఈ నెల 24 నాటికి బంగాళాఖాతంలో తుపాను

  • అండమాన్, బంగాళాఖాతంను ఆనుకుని అల్పపీడన ప్రాంతం
  • మరింత బలపడుతుందన్న ఐఎండీ
  • తుపానుగా రూపాంతరం చెంది దిశ మార్చుకుంటుందని వెల్లడి
  • నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని వివరణ
IMD says Cyclone will be formed in Bay Of Bengal

ఉత్తర అండమాన్ సముద్రం, దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇది ఈ నెల 22 నాటికి వాయుగుండంగా మారుతుందని, ఈ నెల 23వ తేదీకి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని, ఈ నెల 24 నాటికి మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ తాజా బులెటిన్ లో వివరించింది. 

తుపానుగా మారిన అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది. అక్టోబరు 25 నాటికి ఒడిశా తీరాన్ని తాకుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరువలోకి వస్తుందని వెల్లడించింది. 

అటు, నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని, మరో రెండ్రోజుల్లో దేశంలోని అన్ని భాగాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనుదిరుగుతాయని ఐఎండీ పేర్కొంది.

More Telugu News