Pawan Kalyan: పాలకుల ఒత్తిళ్లు లేకపోతే పోలీసులు నిబద్ధతతో పనిచేస్తారు: పవన్ కల్యాణ్

  • నేడు పోలీసు సంస్మరణ దినోత్సవం
  • పోలీసు అమరవీరులకు అంజలి ఘటిస్తున్నట్టు పవన్ వెల్లడి
  • పోలీసు జీవితాలు నిత్యం సవాళ్లతో కూడుకున్నవని వివరణ
  • అమరులైన పోలీసుల త్యాగాలు మరువరాదని స్పష్టీకరణ
Pawan Kalyan pays homage to police martyrs

నేడు పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన ద్వారా స్పందించారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా, అమరులైన పోలీసులకు తన తరఫున, జనసేన తరఫున అంజలి ఘటిస్తున్నానని తెలిపారు. 

పోలీసు శాఖలో హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు అందరి జీవితాలు నిత్యం సవాళ్లతో కూడుకున్నవేనని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలను మరువరాదని స్పష్టం చేశారు. 

ఒంటి మీద యూనిఫాం ఉన్న ప్రతి పోలీసు ఉద్యోగి తన కర్తవ్య నిర్వహణ కోసం నియమ నిబంధనలు పాటించేందుకు సిద్ధమవుతారని, కానీ పాలక పక్షం తమ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను పావులుగా వాడుకోవడం మొదలుపెట్టిన క్షణం నుంచే ఆ శాఖకు సంకెళ్లు పడడం మొదలవుతుందని పవన్ కల్యాణ్ వివరించారు. 

ఉన్నత చదువులు అభ్యసించి సివిల్ సర్వీసెస్ ద్వారా ఎంపికైన అధికారులు సైతం చేష్టలుడిగి ఒత్తిడితో పనిచేసే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

పాలకుల ఒత్తిళ్లు లేకపోతే పోలీసులు నిబద్ధతతో సేవ చేయగలరని అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖలో పనిచేసే సిబ్బందికి టీఏ, డీఏ, సరెండర్స్ ఇవ్వరని, వారు దాచుకున్న మొత్తాన్ని కూడా అవసరానికి ఇవ్వరని జనసేనాని ఆరోపించారు. రాత్రనక పగలనక పనిచేసే పోలీసు సిబ్బందిని కూడా ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదని హితవు పలికారు. 

వారానికి ఒక రోజు సెలవు ఇస్తామని అమలు కాని జీవోలు ఇచ్చి, 'ఆ సెలవు నా మనసులో మాట' అంటూ తియ్యటి కబుర్లు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదని విమర్శించారు. 

పాలకులు ఎలాగూ ఆ శాఖను ఓ పావుగా వాడుకుంటున్నారు... ప్రజలు పోలీసుల పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. పోలీసులు సైతం నియమ నిబంధనలను అనుసరిస్తూ, చట్టాన్ని అమలు చేస్తూ విలువలను పునరుద్ధరిస్తే ప్రజల నుంచి కచ్చితంగా మద్దతు పొందుతారని స్పష్టం చేశారు.

More Telugu News