jodo yatra: భారత్ జోడో యాత్రకు మూడు రోజుల బ్రేక్

short break for bharath jodo yatra
  • ఈ నెల 24 నుంచి 26 వరకు సెలవు
  • మూడు రోజులు ఢిల్లీలోనే రాహుల్ గాంధీ
  • కర్ణాటకలోకి ప్రవేశించిన యాత్ర
  • ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన రాహుల్
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు తాత్కాలిక బ్రేక్ పడనుంది. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న ఈ యాత్ర మూడు రోజుల పాటు ఆగిపోనుంది. పార్టీ మాజీ అధ్యక్షుడు, ఈ యాత్రను చేపట్టిన ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లనుండడంతో ఈ నెల 24 నుంచి 26 వ తేదీ వరకు యాత్రను నిలిపేయనున్నట్లు సమాచారం. దీపావళి పండుగతో పాటు మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుండడంతో రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాహుల్ హాజరవుతారు. అనంతరం ఈ నెల 27న భారత్ జోడో యాత్రను తిరిగి కొనసాగిస్తారు.

మళ్లీ కర్ణాటకలోకి ప్రవేశం..
ఆంధ్రప్రదేశ్ లో 96 కిలోమీటర్లకు పైగా కొనసాగిన భారత్ జోడో యాత్ర శుక్రవారం తిరిగి రాయచూర్ వద్ద కర్ణాటకలోకి అడుగుపెట్టింది. మూడు రోజుల పాటు ఏపీలో కొనసాగిన యాత్రలో స్థానిక నేతలు రాహుల్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ప్రజలు రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పాటు ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. కాగా, భారత్ జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని పార్టీ వర్గాల సమాచారం.
jodo yatra
Congress
Rahul Gandhi
aicc
Karnataka
raichur

More Telugu News