Team India: ఆసియా కప్ విషయంలో పాక్ బోర్డుతో రగడపై స్పందించిన బీసీసీఐ కొత్త అధ్యక్షుడు బిన్నీ

BCCI chief Roger Binny responds on Asia Cup issue with PCB
  • ఇతర దేశాలకు వెళ్లే విషయంలో బీసీసీఐ సొంతంగా నిర్ణయం తీసుకోదని వ్యాఖ్య
  • భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటుందని స్పష్టీకరణ
  • వచ్చే ఆసియా కప్ పాక్ నుంచి తటస్థ వేదికకు మారుస్తామన్న బోర్డు కార్యదర్శి జై షా 
  • దీనిపై తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
వచ్చే ఆసియా కప్ విషయంలో బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య తలెత్తిన వివాదంపై బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. ఇతర దేశాలకు వెళ్లే విషయంలో బీసీసీఐ సొంతంగా నిర్ణయాలు తీసుకోదని, భారత ప్రభుత్వ ఆదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని వివరించారు. 

వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్‌ను తటస్థ వేదికగా నిర్వహించేందుకు భారత కృషి చేస్తుందని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపిన కొన్ని రోజులకే బిన్నీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. విదేశాలకు వెళ్లేందుకు బీసీసీఐ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని రోజర్ బిన్నీ స్పష్టం చేశారు. ‘భారత జట్టు ఇతర దేశాలకు వెళ్లినా లేదా ఇతర దేశాలు ఇక్కడికి వచ్చినా ప్రభుత్వం నుండి క్లియరెన్స్ తీసుకోవాలి. మేం సొంతంగా ఆ నిర్ణయం తీసుకోలేము. మేము ప్రభుత్వంపై ఆధారపడాలి’ అని బిన్నీ స్పష్టం చేశారు. 

2023 ఆసియా కప్ (వన్డే) హక్కులు పాకిస్థాన్ దగ్గర ఉన్నాయి. అయితే, ఈ టోర్నీ కోసం భారత్.. పాక్ వెళ్లదని జై షా చెప్పారు. ఈ టోర్నీని తటస్థ వేదికపైనే ఆడుతుందని ఆయన ప్రకటించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ప్రతిస్పందించింది. ఈ ప్రకటన తమను ఆశ్చర్యానికి గురి చేసిందని పీసీబీ చెప్పింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జై షా అధ్యక్షత వహించిన సమావేశంలోనే పాక్ బోర్డుకు ఆతిథ్య హక్కులు లభించాయని పీసీబీ పేర్కొంది. ఆసియా కౌన్సిల్ లోని సభ్య దేశాలతో ఎలాంటి చర్చ లేకుండా షా ఇలాంటి ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించింది.
Team India
Pakistan
Cricket
asia cup
BCCI
roger binny

More Telugu News