Congress: శశి థరూర్ పై భగ్గుమన్న కాంగ్రెస్... రెండు నాల్కల ధోరణి సరికాదని చీవాట్లు

congress asks shashi tharoor why double standards on presidential polls
  • కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన థరూర్
  • పోలింగ్ లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపించిన ఎంపీ
  • పార్టీ కార్యాలయానికి థరూర్ ను పిలిపించిన మిస్త్రీ
  • రెండు విధాలుగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించిన పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి ఓటమిపాలైన ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ పై పార్టీ ఎన్నికల కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ముందు ఒకలా.. మీడియా ముందు మరోలా వ్యవహరించడం ఏమిటని ఆయనను నిలదీసింది. ఈ తరహా రెండు నాల్కల ధోరణి సరికాదని కూడా చీవాట్లు పెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న జరగగా... ఓట్ల లెక్కింపు ఈ నెల 19న జరిగింది. ఫలితాల్లో మల్లికార్జున ఖర్గే చేతిలో శశి థరూర్ భారీ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన థరూర్...పోలింగ్ లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని కూడా ఆయన అన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మిస్త్రీకి ఆయన ఓ లేఖ రాశారు. ఆ లేఖ మీడియాకు చేరేలా థరూరే వ్యవహరించారన్న ఆరోపణలూ ఉన్నాయి.

ఈ వ్యవహారంపై థరూర్ ను గురువారం పార్టీ కార్యాలయానికి పిలిపించిన మిస్త్రీ ఆయనకు ఫుల్లుగా క్లాస్ తీసుకున్నారు. మీరు మా ముందు ఒకలా, మీడియా ముందు మరోలా ప్రవర్తించారని థరూర్ ముఖం మీదే మిస్త్రీ చెప్పేశారు. మీరు ఇలా వ్యవహరించినందుకు విచారిస్తున్నామని కూడా మిస్త్రీ అన్నారు. పార్టీ సమాధానాలతో సంతృప్తి చెందినట్లు తమ ముందు వ్యవహరించిన తర్వాత... మీడియా ముందుకు వెళ్లాక మరోలా వ్యవహరించారని ఆయన థరూర్ కు తలంటారు. పార్టీ ఎన్నికల కమిటీ వ్యతిరేకంగా వ్యవహరించిందని ఎలా ఆరోపిస్తారని కూడా ఆయనను మిస్త్రీ ప్రశ్నించారు. అయినా మీరు తెలిపిన అభ్యర్థనలను స్వీకరించాం కదా అని మిస్త్రీ అసహనం వ్యక్తం చేశారు.
Congress
Shashi Tharoor
Madhusudal Mystry

More Telugu News