గుండెపోటుతో కుర్చీలోనే ప్రాణాలు విడిచిన జిమ్ యజమాని

  • జ్వరంలోనూ వ్యాయామం కొనసాగింపు
  • జిమ్ నుంచి ఆఫీసుకు చేరుకున్నాక గుండెపోటు
  • ఆఫీసులో కూర్చున్న కొద్దిసేపటికే స్పృహ కోల్పోయిన వైనం
  • సీసీటీవీలో రికార్డ్ అయిన ఘటన
Ghaziabad Gym Trainer Dies Of Heart Attack While Sitting On Chair

ఘజియాబాద్ కు చెందిన ఓ జిమ్ యజమాని గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. జిమ్ నుంచి వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుర్చీలోనే కూలిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఈ షాకింగ్ సంఘటన ఆఫీసులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. గత ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ లో ఆదిల్ (33) తన పేరుతో ఓ జిమ్ నడుపుతున్నాడు. తన జిమ్ కు వచ్చే కస్టమర్లతో పాటు తను కూడా రోజూ వ్యాయామం చేసేవాడు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా వ్యాయామం మాత్రం మానలేదు. ఆదిల్ ఇటీవలే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి, షాలిమార్ గార్డెన్ లో ఆఫీసు తెరిచాడు. ఉదయాన్నే జిమ్ చేసి వచ్చాక టిఫిన్ చేసి షాలిమార్ గార్డెన్ లోని ఆఫీసుకు వెళ్లేవాడు.

ఈ క్రమంలో గత ఆదివారం కూడా అతను జిమ్ కు వెళ్లి ఇంటికొచ్చాడు. ఓవైపు జ్వరంతో బాధపడుతూనే ఆఫీసుకు వెళ్లాడు. లోపలికి వెళ్లి తన సీటులో కూర్చున్నాడో లేదో గుండెపోటుకు గురయ్యాడు. తన సీటులోనే వెనక్కి వాలిపోయాడు. పక్కనే ఉన్నవాళ్లు ఆదిల్ పరిస్థితి చూసి హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయాడని చెప్పారు.

ఆదిల్ మరణవార్త విని ఆయన భార్యా పిల్లలు షాక్ కు గురయ్యారు. తన భర్త వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని ఆదిల్ భార్య చెప్పారు. మామూలు జ్వరమేనని, తనకేమీ కాదని భర్త తేలిగ్గా తీసుకున్నాడని, ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని వాపోయారు. ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న సంఘటనలు పెరుగిపోతున్నాయి. అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్లు హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. కొన్ని వారాల క్రితం ముంబైలో 35 ఏళ్ల వ్యక్తి ఒకరు నవరాత్రి వేడుకల్లో భాగంగా గార్బా డ్యాన్స్ చేస్తూనే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News