Dhanteras: ధన త్రయోదశి.. బంగారం కొనుగోలుకు మంచి తరుణమేనా?

  • దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు బంగారం మార్గం
  • గత 25 ఏళ్లలో ఏటా 10 శాతానికి పైనే
  • ఐదేళ్ల క్రితం ధన త్రయోదశి నుంచి 70 శాతం వృద్ధి
  • పెట్టుబడుల్లో 10 శాతం వరకు కేటాయించుకోవచ్చు
Has Dhanteras day gold buying given good returns

ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేస్తే కలిసొస్తుందన్న ఒక విశ్వాసం హిందువుల్లో ఉంది. వచ్చే ఆదివారమే (ఈ నెల 23) ధన త్రయోదశి. ఆ రోజున బంగారాన్ని ఆభరణాలు, కాయిన్ల రూపంలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. అంతేకాదు కాయిన్లు, డిజిటల్ గోల్డ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడానికీ కొంత మంది ఆసక్తి చూపిస్తుంటారు. మరి ధన త్రయోదశి నాడు బంగారం కొంటే రాబడి వస్తుందా..? ఇందుకు గణాంకాలను పరిశీలించాల్సిందే.

దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు
దీర్ఘకాలంలో బంగారం రాబడినే ఇచ్చినట్టు చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన 20 ఏళ్లలో అంటే 1990 నుంచి చూస్తే.. బంగారం ధర 13 రెట్లు పెరిగింది. 2000 నుంచి చూస్తే 10 రెట్లు పెరిగింది. దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడులకు ఈ గణాంకాలే నిదర్శనం. ఐదేళ్ల క్రితం ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేసి ఉంటే, ఇప్పటికి 70 శాతం రాబడి వచ్చి ఉండేది. అంటే ఏటా 11.2 శాతం కాంపౌండెడ్ రాబడి. ఇక బంగారం 15 ఏళ్ల కాలంలో ఏటా 10.9 శాతం, 25 ఏళ్లలో 10.4 శాతం చొప్పున ఇచ్చింది. 

వైవిధ్యం కోసం
పెట్టుబడి సాధనం ఏదైనప్పటికీ, రాబడి అనేది ద్రవ్యోల్బణ రేటు కంటే ఎక్కువే ఉండాలి. మన దేశంలో సగటు ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉంటోంది. బంగారం దీర్ఘకాలంలో ఎలా చూసుకున్నా 9 శాతం పైనే రాబడిని ఇచ్చింది. పైగా ఆర్థిక సంక్షోభాల్లో, అనిశ్చిత పరిస్థితుల్లో, ద్రవ్యోల్బణం ఎగసినప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనం బంగారమే. అన్ని కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం దండిగా ఉండడానికి కారణం ఇదే. కనుక ఇన్వెస్టర్లు అందరూ తమ పోర్ట్ ఫోలియోలో కనీసం 10 శాతాన్ని బంగారం కోసం కేటాయించుకోవచ్చన్నది నిపుణుల సూచన. దీని వల్ల రిస్క్ ను తగ్గించుకోవచ్చు. 

మార్గాలు..
పెట్టుబడి కోసం అయితే సార్వభౌమ బంగారం బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ లు, గోల్డ్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి. బంగారం కాయిన్లను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. కానీ పెట్టుబడి కోణంలో ఆభరణాలు సరైన ఆప్షన్ కాబోదు.

More Telugu News