Five hours of sleep: రోజుకు ఐదు గంటలే నిద్రపోయేవారికి.. పొంచివున్న పలు వ్యాధుల ముప్పు!

  • రోజులో కనీసం 7-8 గంటల పాటు నిద్ర అవసరం
  • 5 గంటల నిద్రతో ఒకటికి మించిన తీవ్ర వ్యాధులు
  • వీటి కారణంగా 25 శాతం అధిక డెత్ రిస్క్
Five hours of sleep each night linked to greater risk of several diseases Study

రోజులో తక్కువగా నిద్రించే వారు తమ ఆరోగ్యం విషయంలో ఇక మేల్కొనాల్సిందే. తాజా అధ్యయన ఫలితాలను తెలుసుకుంటే నిద్రకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజులో ఐదు గంటలు, అంతకంటే తక్కువ నిద్రించే వారికి తీవ్రమైన వ్యాధుల (దీర్ఘకాలిక వ్యాధులు) ప్రమాదం ఎక్కువగా ఉంటున్నట్టు యూసీఎల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ హెల్త్ రీసెర్చర్స్ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా మధ్య వయసు నుంచి వృద్ధాప్య వయసులోని వారికి ఈ రిస్క్ అధికంగా ఉంటున్నట్టు పరిశోధకులు గమనించారు. ఈ ఫలితాలను పీఎల్ వోఎస్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించారు.

రోజులో ఎంత సమయం పాటు నిద్రిస్తున్నారు? మరణాల రేటు? వారు రెండు లేదా అంతకంటే ఎక్కువ తీవ్ర వ్యాధులకు (గుండె జబ్బులు, కేన్సర్, మధుమేహం) గురయ్యారా? అనే విషయాలను అధ్యయనంలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. 50 ఏళ్ల వయసులో రోజులో ఐదు గంటలు, అంతకంటే తక్కువ నిద్రపోయే వారు కనీసం ఒక్క తీవ్ర వ్యాధి బారిన పడుతున్నట్టు తెలిసింది. ఇలా 25 ఏళ్ల కాలంలో కనీసం రెండు అంతకుమించి తీవ్ర వ్యాధుల బారిన పడే రిస్క్ 40 శాతం ఉంటోందని తెలిసింది. ఏడు గంటల పాటు నిద్రించే వారితో పోల్చినప్పుడు ఈ విషయాలు తెలిశాయి. 

50 ఏళ్లు, 60 ఏళ్లు, 70 ఏళ్ల వయసులో రోజులో 5 గంటలు, అంతకంటే తక్కువ నిద్రించే వారు.. ఏడు గంటల పాటు నిద్రించే వారితో పోలిస్తే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం 30-40 శాతం ఎక్కువగా ఉంటోంది. 50 ఏళ్ల వయసులో రోజుకు 5 గంటలే నిద్రించే వారు తదుపరి 25 ఏళ్లలో మరణించే రిస్క్, ఏడు గంటల వారితో పోలిస్తే 25 శాతం ఎక్కువగా ఉంటోంది. 

‘‘ప్రజలు వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తే వారి నిద్ర తీరులో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే, కనీసం 7-8 గంటల పాటు నిద్రించాలి. తక్కువ నిద్ర ఒకటికి మించిన వ్యాధులను తెచ్చి పెడుతుందని మా అధ్యయనం గుర్తించింది. మంచి నిద్ర కోసం పడకగది పరిశుభ్రంగా ఉంచుకోవడం, చీకటిగా, సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ డివైజ్ లను దూరం పెట్టాలి. పడుకునే ముందు భారీ భోజనాలు చేయకూడదు’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ సెవెరిన్ సాబియా సూచించారు.

More Telugu News