Congress: మొదలైన లెక్కింపు.. సాయంత్రానికి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు

  • ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మొదలైన కౌంటింగ్
  • మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ సమక్షంలో ఓట్ల లెక్కింపు
  • పోలైన మొత్తం ఓట్లు 9500
counting begins at AICC office

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరనేది సాయంత్రానికల్లా తేలిపోనుంది. అధ్యక్ష ఎన్నికలకు సోమవారం పోలింగ్ జరగగా.. ఈ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం పది గంటలకు అధ్యక్ష అభ్యర్థులు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ ల సమక్షంలో పార్టీ ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను తెరిచారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 67 కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి, వాటన్నిటినీ కలిపేసి ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. ఖర్గే తరఫున కౌంటింగ్ ఏజెంట్లుగా ప్రమోద్ తివారీ, కొడికునిల్ సురేష్, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, కుల్జిత్ సింగ్ బగ్రా, గుర్దీప్ సింగ్ సప్పల్ వ్యవహరిస్తున్నారు. ఇక శశిథరూర్ తరఫున కార్తి చిదంబరం, అతుల్ చతుర్వేది, సుమేద్ గైక్వాడ్ లు కౌంటింగ్ ఏజెంట్లుగా వున్నారు. 

ఇంతకుముందు 2000లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేత జితేంద్ర ప్రసాద పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు. సోనియా గాంధీకి మొత్తం 7400 ఓట్లు రాగా.. జితేంద్ర ప్రసాదకు కేవలం 94 మంది ప్రతినిధులు మాత్రమే ఓటేశారు. ఈ ఎన్నికల తర్వాత 22 ఏళ్లకు మళ్లీ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అయితే, ఈసారి గాంధీ కుటుంబ సభ్యులు ఎవరూ బరిలో లేకపోవడం విశేషం. దాదాపు 24 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కు గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నారు.

More Telugu News