Srikakulam District: విశాఖపట్టణం లాడ్జీలో శ్రీకాకుళం ప్రేమజంట ఆత్మహత్య

Srikakulam Love Couple Committed Suicide in Visakha Lodge
  • సోమవారం లాడ్జీలో గది అద్దెకు తీసుకున్న ప్రేమ జంట
  • మంగళవారం మధ్యాహ్నమైనా బయటకు రాకపోవడంతో అనుమానం
  • పోలీసులకు సమాచారం అందించిన లాడ్జీ సిబ్బంది
  • బాత్రూములోని కిటికీ ఊచలకు ఉరివేసుకున్న యువతీ యువకులు
విశాఖపట్టణం లాడ్జీలో శ్రీకాకుళం జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రాణప్రదంగా ప్రేమించుకున్న వారిద్దరూ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నకొత్తపేట ప్రాంతానికి చెందిన కందివలస దామోదర్ (20) డిగ్రీ చదువుతున్నాడు. ఆముదాలవలస మండలంలోని బలగాం గ్రామానికి చెందిన అదపాక సంతోషి కుమారి (17) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి మధ్య ఇటీవల ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్య ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ పెనవేసుకుపోయింది.

సోమవారం మధ్యాహ్నం వీరిద్దరూ విశాఖపట్టణం చేరుకుని దరిగొల్లపాలెంలోని ఓ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం అవుతున్నా ఇద్దరూ గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జీ సిబ్బంది తలుపుకొట్టారు. అయినప్పటికీ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూశారు. బాత్రూములోని కిటికీ గది ఊచలకు ఇద్దరూ ఉరివేసుకుని కనిపించారు. 

యువతి మెడలో పసుపు తాడును గుర్తించిన పోలీసులు పెళ్లి చేసుకున్న అనంతరం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కాగా, వీరిద్దరూ ప్రేమించుకున్న విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడం గమనార్హం. తెలిస్తే పెళ్లికి అంగీకరించరన్న భయంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు, విషయం తెలిసి ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Srikakulam District
Visakhapatnam
Love Couple
Suicide

More Telugu News