Cyclone: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం

  • 22న వాయుగుండంగా మారి ఆపై తుపానుగా రూపాంతరం చెందే అవకాశం
  • ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
  • కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు
  • గతరాత్రి విజయవాడలో భారీ వర్షం
Low Pressure in Bay of Bengal will be Change as Cyclone

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపటికి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అనంతరం ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ 22న ఉదయానికి వాయుగుండంగా మారుతుందని, ఆ తర్వాత మరింతగా బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు  తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర తీరంలో రేపు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 21, 22 తేదీల్లో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి జాలర్లు వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. కాగా, గతరాత్రి విజయవాడలో కురిసిన భారీ వర్షానికి నగరం జలమయం అయింది.

More Telugu News