Pattabhi: ప్రజాస్వామ్య పరిరక్షణకే చంద్రబాబు, పవన్ కలయిక: టీడీపీ నేత పట్టాభిరామ్

Pattabhiram press meet after Chandrababu met Pawan Kalyan
  • విజయవాడలో పవన్ ను కలిసిన చంద్రబాబు
  • ఇటీవలి పరిణామాలపై చర్చ
  • వైసీపీ మంత్రుల విమర్శలు
  • స్పందించిన టీడీపీ నేత పట్టాభిరామ్
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో ఈ సాయంత్రం పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది మరో స్వాతంత్ర్య పోరాటం అని అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వ రౌడీయిజం, అరాచకాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్లాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించుకున్నారని తెలిపారు. 

పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు చంద్రబాబు ఆయనను కలవడం జరిగిందని వెల్లడించారు. ఈ సమాచారం తెలిశాక ఏంచేయాలో పాలుపోని వైసీపీ మంత్రులు, నాయకులు మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలిపారు. పవన్, చంద్రబాబు కలవగానే వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకుంటున్నారని పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు. మీ అందరికీ డైపర్లు పంపిస్తాం... ఇకపై వాటిని తొడుక్కొని తిరిగితే మంచిదని పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు.   

వైసీపీ మంత్రులు, నేతలు ప్యాకేజీలంటూ అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని, అడ్డంగా ప్రజాధనాన్ని దోచుకోవడం, ప్యాకేజీలు ఇవ్వడం వైసీపీ వాళ్లకే అలవాటని తెలిపారు. "దోచుకున్న సొమ్ముతో ప్యాకేజిలు ఇచ్చిపుచ్చుకునే అలవాటు ఉన్నది మీకే. 2004లో వైఎస్... కేసీఆర్ కి ఏం ప్యాకేజి ఇచ్చి మద్దతు పొందారు?" అని నిలదీశారు. ప్యాకేజిలకు పేటెంట్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదేనని, మీ ప్యాకేజిల బాగోతం రాష్ట్రం అంతా చూస్తోందని విమర్శించారు. 

"పేర్ని నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు వంటివారు ఈరోజు శాంతిభద్రతల గురించి మాట్లాడుతున్నారు. పేర్ని  నాని రాడ్లు, కర్రలతో దాడి చేస్తారా? అంటున్నారు. మా పార్టీ ఆఫీసుపై దాడి చేసినపుడు వైసీపీ వీధికుక్కలు, సైకోగాళ్లు ఏం పట్టుకొని వచ్చారో తెలియదా?

జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఇంటిపైకి వచ్చి దాడి చేసి అదో ఘనతగా చెప్పుకుంటున్నారు. అవసరమైతే మరోసారి వస్తామని అంటున్నారు. దమ్ముంటే ఈసారి చంద్రబాబు ఇంటి దరిదాపులకు రా చూసుకుందాం... తాటతీస్తాం" అని పట్టాభిరామ్ హెచ్చరించారు. 

ప్రజాసేవలో ఉన్నవారికి కులం ఉంటుందా అని గుడివాడ అమర్నాథ్ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని, కులగజ్జితో పబ్బం గడుపుకుంటున్నది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. 

"టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినపుడు  సైకో స్టార్ జగన్ రెడ్డి  ఏమన్నారు? వారి కార్యకర్తలకు బీపీలు వచ్చి దాడిచేశారని అన్నారు. బీపీలు వచ్చేది మీకేనా, మీ పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజలకు రావా?  పెరిగిన కరెంటు బిల్లు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇళ్ల పన్నులు చూసినపుడు 5 కోట్లమంది ప్రజలకు కూడా బీపీ వస్తోంది" అని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు.
Pattabhi
Chandrababu
Pawan Kalyan
TDP
Janasena
YSRCP

More Telugu News