Tamilnadu: జయలలిత మరణంపై సంచలన విషయాలను బయటపెట్టిన ఆర్ముగస్వామి కమిషన్

  • జయ మరణంపై అనుమానం వ్యక్తం చేసిన పన్నీర్ సెల్వం
  • పన్నీర్ సెల్వం అనుమానాలతో ఆర్ముగస్వామి కమిషన్ ను ఏర్పాటు చేసిన పళనిస్వామి
  • ఈ ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ఆర్ముగస్వామి కమిషన్
  • శశికళ, జయ వ్యక్తిగత వైద్యుడు, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిలను విచారించాలని సిఫారసు
armugaswamy commission viral comments on jayalalitha death

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై నియమించిన ఆర్ముగస్వామి కమిషన్ ఇప్పటికే తన నివేదికను తమిళనాడు సర్కారుకు అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నివేదికలోని పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనారోగ్య సమస్యలతోనే జయలలిత మరణించినా.. ఆమె మరణించిన సమయం, జయలలితకు అందిన వైద్య చికిత్సలపై కమిషన్ సందేహాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా జయలలిత నెచ్చెలి శశికళను విచారించాలని కమిషన్ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.

జయలలిత 2016 డిసెబర్ 5న మరణించినట్లు వైద్యులు చెబుతున్నా... తాము విచారించిన సాక్షుల కథనం ప్రకారం.. ఆమె 2016 డిసెంబర్ 4వ తేదీనే మరణించారని కమిషన్ పేర్కొంది. ఈ లెక్కన జయలలిత మరణించిన మరునాడు ఆమె మరణాన్ని ప్రకటించారని తెలిపింది. జయలలిత మరణంపై శశికళతో పాటు ఆమె బంధువు అయిన వైద్యుడు, జయకు వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన డాక్టర్ శివకుమార్, నాడు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ కుమార్, ఆ శాఖ కార్యదర్శిలపై విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. జయ మరణంపై నెలకొన్న అనుమానాలు వీడాలంటే శశికళతో పాటు పైన చెప్పిన వారందరినీ విచారించాల్సిందేనని కూడా కమిషన్ తన నివేదకలో తెలిపింది.

జయలలిత మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ముఖ్య అనుచరుడు, మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. నాడు సీఎంగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి...ఈ అనుమానాలను నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఇక గతేడాది ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జయ మరణంపై నెలకొన్న అనుమానాలను నిగ్గు తేలుస్తామని డీఎంకే ఛీఫ్ ఎంకే స్టాలిన్ కూడా ప్రకటించారు. ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించడంతో ఈ ఏడాది ఆగస్టులో ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.

More Telugu News