Tulasi: ఒక మనిషి చనిపోతే ఇంతమంది వస్తారా? అని ఆశ్చర్యమేసింది!: తులసి

  • కేరక్టర్ ఆర్టిస్టుగా తులసి బిజీ 
  • తాజా ఇంటర్వ్యూలో గత జ్ఞాపకాల ఆవిష్కరణ 
  • సావిత్రి ఆశీస్సులు అందుకున్నానంటూ హర్షం 
  • ఆమె జీవితమే ఒక పాఠమంటూ స్పష్టీకరణ  
Tulasi Interview

తెలుగు తెరపై గలగలమని మాట్లాడే నటిగా తులసికి మంచి పేరు ఉంది. కథానాయికగా సక్సెస్ లు చూసిన ఆమె, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. యంగ్ హీరోలకి .. హీరోయిన్లకి తల్లి పాత్రలతో ముందుకు వెళుతున్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసి మాట్లాడుతూ మహానటి సావిత్రిని గురించి ప్రస్తావించారు. 

"సావిత్రి గారితో మా అమ్మగారికి మంచి స్నేహం ఉండేది. సావిత్రిగారి సూచన వల్లనే మా అమ్మగారు నన్ను సినిమాలకి పరిచయం చేశారు. సావిత్రి గారి చివరి రోజుల్లో చిన్న ఇంట్లో ఉండటం నిజమే. ఆ ఇంటికి రోడ్డు ఇవతల మా ఇల్లు ఉండేది. సావిత్రిగారు చివరి రోజుల్లో పడిన కష్టాలను చూస్తే .. ఈ కళ్లే వద్దు అనిపిస్తుంది. ఆమె చనిపోయినప్పుడు ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయాయి. ఒక మనిషి చనిపోతే ఇంతమంది వస్తారా? అనే ఆశ్చర్యం అప్పట్లో అందరిలో ఉండేది. సావిత్రిగారు ఎన్నో దానాలు చేశారు .. ఆమెకి ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటి? అని అంతా అనుకుంటారు. కానీ ఆమె దగ్గర నటించి దానాన్ని పొందినవారే ఎక్కువ.

సావిత్రిగారిని చూసిన చాలామంది తమ జీవితంలో డబ్బు విషయంలో జాగ్రత్త పడ్డారు. చివరి రోజులను దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. అలా కూడా ఆ తల్లి అందరికీ మంచే చేసింది. ఆమె నుంచి నేను అందుకున్న ఆశీస్సుల ముందు ఏ అవార్డులు పనికి రావు.  ఇక మా వారు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తానంటూ ఆర్ధికంగా  నష్టాలు తెచ్చాడు. ఆ సమయంలో నేను రీ ఎంట్రీ ఇవ్వడం వలన అప్పులనేవి అంతగా ఎఫెక్ట్ చూపలేదు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News