Pawan Kalyan: సంయుక్తంగా మీడియా ముందుకొచ్చిన పవన్ కల్యాణ్, సోము వీర్రాజు

  • విజయవాడలో పవన్ ను కలిసిన వీర్రాజు
  • తాజా పరిణామాలపై చర్చ
  • బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్
  • గర్జన విఫలమైందన్న సోము వీర్రాజు
  • అందుకే జనసేనపై కుట్రకు పాల్పడ్డారని వ్యాఖ్యలు
Pawan Kalyan and Somu Veerraju joint press meet in Vijayawada

కొన్నాళ్లుగా జనసేన, బీజేపీ మధ్య ఎడం పెరిగిందన్న ప్రచారం ఉంది. అయితే విశాఖ ఘటనల నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు ముక్తకంఠంతో పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విజయవాడలో పవన్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. సమావేశం అనంతరం ఇరువురు సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. 

తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో నిన్నటి ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. సన్నాసులు ఏదో వాగుతారని, వారి గురించి పట్టించుకోనవసరంలేదని అభిప్రాయపడ్డారు. 

సోము వీర్రాజు మాట్లాడుతూ, విశాఖలో నిర్వహించిన వైసీపీ గర్జన ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కార్యక్రమం అని ఆరోపించారు. అయితే ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో వైసీపీ నేతలు తీవ్ర అసహనానికి గురై జనసేనపై కుట్రకు తెరదీశారని వివరించారు. 

అంతకుముందు, పవన్ ను కలవడంపై సోము వీర్రాజు ట్విట్టర్ లో స్పందించారు. మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించానని వెల్లడించారు. వ్యక్తిగత దూషణలతో మొదలైన వైసీపీ ప్రస్థానం, పోలీసులను అడ్డంపెట్టుకుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించే స్థాయికి చేరిన తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వివరించారు. 

పాలనలో వ్యవస్థలను మేనేజ్ చేసే కుయుక్తులు ప్రదర్శించినా, ప్రజల మనసులో మార్పును, అంతిమంగా ప్రజాక్షేత్రంలో తీర్పును నిలువరించే శక్తిసామర్థ్యాలు ప్రభుత్వాలకు ఉండవని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధికార పార్టీ గ్రహించాలని హితవు పలికారు.

More Telugu News