YSRCP: ఇలాగైతే రాజకీయాలు చేయడం చాలా కష్టం.. సంచలనం రేపుతున్న రోజా వ్యాఖ్యలు

  • న్యూస్ ఛానెళ్లలో ప్రసారమైన రోజా ఆడియో వీడియో
  • మంత్రిని అయిన తననే వీక్ చేసే యత్నమంటూ రోజా ఆవేదన
  • పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నామన్న మంత్రి
  • టీడీపీ, జనసేనలు నవ్వుకునే విధంగా చేస్తున్నారని మనస్తాపం
  • ఇలాంటి వారిని పార్టీ నాయకులుగా ఎంకరేజ్ చేయడం బాధేస్తోందని ఆవేదన
roja audio on ysrcp internal fighting goes viral

ఏపీలో అధికార పార్టీ వైసీపీలో అసమ్మతిపై ఆ పార్టీ కీలక నేత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆడియో ఒకటి సోమవారం కలకలం రేపింది. రోజా మాట్లాడినట్లుగా ఉన్న ఆ వీడియో పలు న్యూస్ ఛానెళ్లలో ప్రసారం కాగా... ఈ వీడియోపై పెద్ద చర్చే జరుగుతోంది. 

విశాఖలో పార్టీ నిర్వహించిన విశాఖ గర్జన సభ తర్వాత రోజా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రోజా సొంత నియోజకవర్గం నగరి పరిధిలోని నిండ్ర మండలం కొప్పెడలో రైతు భరోసా కేంద్రానికి ఆమె వ్యతిరేక వర్గం భూమి పూజ చేసింది. ఈ కార్యక్రమానికి రోజాకు ఆహ్వానం లేకపోగా శ్రీశైలం దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కేజే శాంతి హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రోజా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

మీడియాలో ప్రసారం అయిన ఆ ఆడియోలో రోజా ఏమన్నారంటే.. ''ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను నియోజకవర్గంలో బలహీనపరిచే విధంగా... తెలుగు దేశం, జనసేన వాళ్లు నవ్వుకునే విధంగా.. ఆ పార్టీలకు సపోర్ట్ అవుతూ... నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్లు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్టో మీరంతా ఆలోచించాలి. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం. మేం ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే.. ప్రతిరోజూ మాకు మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు, పార్టీకి నష్టం జరుగుతుంటే... వీళ్లు పార్టీ నాయకులని ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తోంది'' అంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 

More Telugu News