Sourav Ganguly: ముందు షారుఖ్ ఖాన్ ను తొలగించండి... గంగూలీ అంశంలో మమతా బెనర్జీకి బీజేపీ కౌంటర్

  • గంగూలీకి బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో పర్యాయం మొండిచేయి
  • గంగూలీకి అన్యాయం జరుగుతోందన్న మమతా బెనర్జీ
  • ప్రధాని జోక్యం చేసుకోవాలని వినతి
  • క్రికెట్ వ్యవహారాల్లో ప్రధాని కలుగజేసుకోరన్న సువేందు
  • మమత దీనిపై రాజకీయాలు మానుకోవాలని హితవు
Bengal BJP replies to Mamata Banarjee over Ganguly issue

భారత క్రికెట్ పాలనా వ్యవహారాల్లో సౌరవ్ గంగూలీకి అన్యాయం జరుగుతోందని, రెండో పర్యాయం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగలేని పరిస్థితులు ఏర్పడ్డాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం తెలిసిందే. గంగూలీని ఐసీసీ చైర్మన్ గా పంపించేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీనిపై బీజేపీ స్పందించింది. ముందు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా షారుఖ్ ఖాన్ ను తొలగించి, అతడి స్థానంలో గంగూలీని నియమించండి అంటూ హితవు పలికింది. 

గంగూలీ 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మరికొన్నిరోజుల్లో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే రెండో పర్యాయం బోర్డు అధ్యక్షుడిగా కొనసాగేందుకు న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేనప్పటికీ, బోర్డులోని ఇతర సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

గత వారం ఢిల్లీలో బీసీసీఐ పెద్దలు సమావేశమయ్యారు. గంగూలీ మరోసారి బోర్డు పగ్గాలు చేపట్టడం అసాధ్యమని ఆ సమావేశంతో తేలిపోయింది. బోర్డు సభ్యులు రోజర్ బిన్నీ వైపు మొగ్గు చూపారు. గంగూలీ హయాంలో బోర్డు కార్యదర్శిగా ఉన్న జై షానే ఇకపైనా అదే పదవిలో కొనసాగుతాడని దాదాపు నిశ్చయమైంది. 

ఈ పరిణామాలపై బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గంగూలీని రాజకీయ ప్రతీకారాలకు బలిపశువును చేస్తున్నారని ఆరోపించింది. సీఎం మమతా బెనర్జీ కూడా ఇదే రీతిలో ధ్వజమెత్తగా, బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. 

గంగూలీని కాకుండా షారుఖ్ ఖాన్ ను బెంగాల్ అంబాసిడర్ గా ఎందుకు నియమించారని సువేందు అధికారి ప్రశ్నించారు. గంగూలీ గొప్పదనాన్ని ఇంత ఆలస్యంగా గుర్తించారా? అని మమతను నిలదీశారు. దీనిపై రాజకీయాలు చేయడం తగదని స్పష్టం చేశారు. క్రికెట్ పాలనా వ్యవహారాల్లో ప్రధానమంత్రి కలుగజేసుకోరన్న విషయాన్ని మమతా బెనర్జీ తెలుసుకోవాలని అన్నారు.

More Telugu News