KTR: మోదీకి అస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే: కేటీఆర్ సెటైర్లు

  • 2013లో రూపాయి పతనంపై అప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మోదీ ప్రసంగం
  • మోదీ నటనకు అవార్డు ఇవ్వాల్సిందేనన్న కేటీఆర్
  • ఏ కేటగిరీలో నోబెల్ ప్రైజ్ ఇద్దామంటూ ఆప్షన్లు ఇచ్చిన వైనం
Modi has to be awarded with Bhaskar award tweets KTR

ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు. మోదీ మహానటుడని... ఆయనకు అస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు. పతనమవుతున్న రూపాయి విలువ గురించి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 2013లో ఆయన చేసిన ఉపన్యాసం మామూలుగా లేదని... ఆయన హావభావాలు, నటనకు గాను ఆయనను తాను అవార్డుకు నామినేట్ చేస్తున్నానని చెప్పారు. మోదీని విశ్వ గురువుగా, నోబెల్ కంటే గొప్ప వ్యక్తిగా భావించే బీజేపీ శ్రేణులకు ఈ విషయాన్ని చెపుతున్నానని అన్నారు. 

మోదీ గారు నోబెల్ ప్రైజుకు అర్హులే... కానీ ఏ కేటగిరిలో? అంటూ కేటీఆర్ కింది ఆప్షన్లు ఇచ్చారు. 

  • మెడిసిన్ లో నోబెల్ - కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నందుకు
  • ఆర్థికశాస్త్రంలో నోబెల్ - పెద్ద నోట్ల రద్దు, స్విస్ బ్యాంకుల నుంచి నల్ల ధనాన్ని వెనక్కి రప్పించడం
  • నోబెల్ శాంతి పురస్కారం - రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని 6 గంటల పాటు ఆపినందుకు
  • భౌతికశాస్త్రంలో నోబెల్ - రాడార్ థియరీకి ... అంటూ ట్వీట్ చేశారు. 

కోవిడ్ వ్యాక్సిన్ ను కనుక్కున్నందుకు మెడిసిన్/సైన్స్ లో మోదీకి నోబెల్ ప్రైజ్ ను డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. మోదీ కేబినెట్ సహచరులంతా మేధావులనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని ముఖ్యంగా కిషన్ రెడ్డి అని సెటైర్ వేశారు. 'మన దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ధైర్యం చేసి వ్యాక్సిన్ కనుక్కున్నారు' అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు.

More Telugu News