Delhi Liquor Scam: నన్ను అరెస్టు చేసేందుకు పన్నాగం: మనీశ్ సిసోడియా

  • సీబీఐ సమన్లపై స్పందించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం
  • గుజరాత్ ఎన్నికల ప్రచారానికి దూరం చేయడానికేనని ఆరోపణ
  • ఈరోజు విచారణకు హాజరుకానున్న మనీశ్  
  • లిక్కర్ పాలసీ స్కాం కేసులో విచారించనున్న అధికారులు
Manish Sisodia On CBI Summons

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడం కోసం తనను అరెస్టు చేసే పన్నాగం పన్నుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో విచారణకు రావాలంటూ సీబీఐ పంపిన సమన్లపై సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. గుజరాత్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరఫున తాను అక్కడ ప్రచారం చేయబోతున్నానని చెప్పారు. తాను అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడానికే 'నకిలీ కేసు'లో విచారణ పేరుతో సీబీఐతో నోటీసులు ఇప్పించారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు అధికారుల ముందుకు వెళ్లనున్నారు. 

గుజరాత్ లో ఓటమి ఖాయమని బీజేపీ నేతలకు అర్థమైందని సిసోడియా పేర్కొన్నారు. ఓటమి భయంతోనే ఆప్ ప్రచారానికి ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శించారు. అయితే, తనను అరెస్టు చేస్తే గుజరాత్ లో ఆప్ ఎన్నికల ప్రచారం ఆగదని సిసోడియా ట్వీట్ చేశారు. గతంలో సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. దాదాపు 14 గంటల పాటు సోదాలు జరిపినా అధికారులకు ఏమీ దొరకలేదని చెప్పారు. తన నివాసంతో పాటు బ్యాంకు లాకర్లు కూడా తనిఖీ చేశారని, అందులోనూ ఏమీ దొరకలేదని వివరించారు. ఈ నేపథ్యంలోనే తనను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని సిసోడియా ఆరోపించారు.

  • Loading...

More Telugu News