Manava Naik: మరాఠీ నటి మానవ నాయక్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఉబెర్ డ్రైవర్.. ఫేస్‌బుక్‌ పోస్టుపై స్పందించిన పోలీసు కమిషనర్

  • ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న మానవ నాయక్
  • అసభ్యంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు గురిచేశాడంటూ ఫేస్‌బుక్‌లో  పోస్టు
  • ఇద్దరు బైకర్లు, ఓ ఆటోవాలా తనను కాపాడారన్న నటి
Actor Claims Uber Cab Driver Misbehaved With Her Mumbai Police Responds

మరాఠీ నటి, దర్శకురాలు మానవ నాయక్‌కు ఉబెర్ డ్రైవర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. అతడి బెదిరింపులతో తాను చాలా భయపడ్డానంటూ ఆమె చేసిన ఫేస్‌బుక్ పోస్టుకు ముంబై పోలీస్ జాయింట్ కమిషనర్ విశ్వాస్ నంగ్రే పాటిల్ స్పందించారు. నిందితుడిని పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చారు. 

మానవ నాయక్ పోస్టు ప్రకారం.. శనివారం రాత్రి 8.15 గంటల సమయంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి తన ఇంటికి వెళ్లేందుకు నటి ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. ఆమె కారు ఎక్కిన తర్వాత డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన ఆమె ఫోన్‌ను పక్కనపెట్టాలని పదేపదే అభ్యర్థించినా పట్టించుకోలేదు సరికదా.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, సిగ్నల్స్‌ను జంప్ చేస్తూ వెళ్తున్న అతడిని ఓ ప్రదేశంలో ట్రాఫిక్ పోలీసులు ఆపి ఫొటోలు తీసుకున్నారు. దీంతో పోలీసులతో డ్రైవర్ వాగ్వివాదానికి దిగాడు. 


దీంతో కల్పించుకున్న మానవ నాయక్ ఫొటోలు తీసుకున్నారు కాబట్టి తమను వదిలేయాలని పోలీసులను కోరారు. దీంతో నటిపై మండిపడిన డ్రైవర్ ‘రూ. 500 ఫైన్ నువ్వు చెల్లిస్తావా?’ అని ఆమెతో గొడవకు దిగాడు. చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె కారును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని కోరారు. అతడు ఆగ్రహంతో వేగంగా డ్రైవ్ చేస్తూ బీకేసీలో చీకటిగా ఉన్న ప్రదేశంలో ఆపాడు. ఆ తర్వాత డ్రైవర్ వేగం పెంచి చునాబట్టి రోడ్డు, ప్రియదర్శిని పార్క్ మీదుగా పోనిచ్చాడు. ఇలాగైతే లాభం లేదనుకున్న నటి ఉబెర్ సేఫ్టీ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేశారు. 

ఆమె మాట్లాడుతుండగానే డ్రైవర్ మరోమారు కారు వేగం పెంచి దూసుకెళ్లాడు. దీంతో భయపడిన మానవ నాయక్ కారు ఆపాలని కోరారు. అతడు ఆపకుండా వేరే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుండడంతో భయపడిన ఆమె రక్షించమని కేకలు వేయడం మొదలుపెట్టారు. గమనించిన ఇద్దరు బైకర్లు, ఓ ఆటోవాలా కారును అడ్డుకుని నటిని రక్షించారు. వారి సాయంతో తాను బయటపడ్డానని, కానీ చాలా భయపడిపోయానంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు. కారు నంబరుతోపాటు డ్రైవర్ ఫొటోను కూడా షేర్ చేశారు. దీనికి స్పందించిన పోలీస్ జాయింట్ కమిషనర్.. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.  నిందితుడి కోసం పోలీసులు రంగంలోకి దిగినట్టు చెప్పారు.

More Telugu News