Katragadda Murari: ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత

  • చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచిన మురారి
  • ఎంబీబీఎస్‌ను వదిలేసి సినీ రంగంవైపు
  • యువ పేరుతో బ్యానర్ స్థాపించి పలు హిట్ సినిమాలు నిర్మించిన మురారి
  • చివరి సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’
telugu film producer katragadd murari passed away

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన మురారి చిన్నప్పటి నుంచే సంగీతం, సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో సినిమాలు చూసి వాటిపై సమీక్షలు, వ్యాసాలు రాసేవారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు దానిని వదిలేసి సినిమాలపై ఆసక్తితో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. బాబాయి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో దర్శకుడు మధుసూదనరావు వద్ద 1969లో సహాయ దర్శకుడిగా చేరారు.

‘మనుషులు మారాలి’ సినిమాకు తొలిసారి పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడు చక్రపాణితో ఏర్పడిన పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. వి.మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు, బాలచందర్, సేతుమాధవ్, బాపు వంటి ప్రముఖుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి అనుభవం సంపాదించారు. ఆ తర్వాత ‘యువ చిత్ర ఆర్ట్స్’ పేరుతో బ్యానర్ స్థాపించి ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘అభిమన్యుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘జానకి రాముడు’, ‘నారీనారీ నడుమ మురారి’ వంటి హిట్ సినిమాలు నిర్మించారు. మురారి మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

More Telugu News