ఫుట్​ బాల్​ ఆడుతున్న కుక్కపిల్ల.. ఎక్కడా తగ్గట్లేదంటూ నెటిజన్ల ప్రశంసలు.. వీడియో ఇదిగో

15-10-2022 Sat 13:38 | Offbeat
  • ఓ వీధిలో ఓ వైపు చిన్నారి, మరోవైపు కుక్కపిల్ల కలిసి ఫుట్ బాల్ ఆట
  • బంతిని ఏ మాత్రం మిస్ కాకుండా పట్టుకుని తన్నిన కుక్కపిల్ల
  • శునకాలు మనుషులకు మంచి మిత్రులేనని మరోసారి రుజువైందంటూ నెటిజన్ల కామెంట్లు
  • ఇదే వీడియో కామెంట్లలో వాలీబాల్ ఆడుతున్న మేక వీడియో కూడా..
Kid play football with dog viral video
ఇళ్లలో పెంపుడు జంతువులతో ఆటలాడటం సాధారణమే. ముఖ్యంగా కుక్కపిల్లలతో బయట ఆటలు ఆడుతుండటం ఎక్కువ. మనం ఏదైనా వస్తువునుగానీ, బాల్ ను గానీ విసిరివేస్తే.. కుక్కలు పరుగెత్తుకు వెళ్లి తెచ్చిస్తుంటాయి. కొన్నిసార్లు నోటితో క్యాచ్ పడుతుంటాయి కూడా. అయితే ఓ చిన్నారితో కుక్కపిల్ల ఫుట్ బాల్ ఆడిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంచి ఆటగాళ్లలా ఆడుతూ..
వీడియోలో ఓ వీధిలో చిన్నారి ఓ వైపు, కుక్కపిల్ల మరోవైపు ఉండి ఫుట్ బాల్ ఆడుతున్నారు. చిన్నారి కాలితో బాల్ ను తంతే కుక్కపిల్ల దాన్ని తిరిగి చిన్నారి వైపు తోస్తోంది. బంతిని తలతో, కాళ్లతో ఆపుతూ.. ఒక్కోసారి కాళ్లతో, ఒక్కోసారి తలతో బంతిని తోస్తుండటం ఆకట్టుకునేలా ఉంది. ఎక్కడా తగ్గకుండా, ఏమాత్రం మిస్సవకుండా బాల్ ను ఆపుతుండటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
  • బిటింగెబీడెన్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. నాలుగు రోజుల్లోనే 13 లక్షలకుపైగా వ్యూస్ నమోదవడం గమనార్హం. ఇదే సమయంలో ఆరు వేలకుపైగా ట్వీట్లు, 53 వేలకుపైగా లైకులు కూడా వచ్చాయి.
  • ఏమైనా కుక్కపిల్లతో చిన్నారి ఫుట్ బాల్ ఆట చాలా బాగుందంటూ పెద్ద సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.
  • ‘‘శునకాలు మానవులకు మంచి తోడు అని మరోసారి రుజువైంది” అని కొందరు పేర్కొంటుంటే.. ‘‘కుక్కపిల్ల ఆట చాలా బాగుంది. ఎక్కడా తగ్గట్లేదు. బాల్ ఎటువైపు వెళ్లినా ఆపి.. తిరిగి ముందుకు తన్నుతోంది. సూపర్..” అంటూ ఇంకొందరు అంటున్నారు.
  • ‘‘నిజానికి నాకు ఫుట్ బాల్ అంటే నచ్చదు. కానీ ఆ కుక్క పిల్ల ఆడుతుంటే ముచ్చటగా ఉంది. దానితో నాకూ ఫుట్ బాల్ ఆడాలని ఉంది..” అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి.
  • అయితే ఈ వీడియోల మిక్సింగ్ చేసిన ఓ పిల్లాడి నవ్వు ఆడియోపై మాత్రం బాలేదంటూ కొందరు, బాగుందంటూ కొందరు నెటిజన్లు భిన్నమైన స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.

వాలీబాల్ ఆడుతున్న మేక వీడియో కూడా..
ఇంకొందరైతే ఇలాంటి సరదా వీడియోలను కామెంట్ల కింద పోస్ట్ చేస్తుండటం కూడా అలరిస్తోంది. అలా ఓ మేక వాలీ బాల్ ఆడుతున్న వీడియో కూడా బాగుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఓ పిల్లాడు బంతిని మేకవైపు విసిరివేస్తుంటే.. అది తన తలతో తిరిగి కొడుతుండటం ఆకట్టుకుంటోంది. అయితే ఈ వీడియోలో మేకను కట్టేసి ఉంచడంపై మాత్రం నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.