UK: బ్రిటన్ ప్రధాని పీఠం రిషి సునక్ కు దక్కుతుందా?

  • ప్రస్తుత ప్రధాని లిజ్ ట్రస్‌  పై తీవ్ర వ్యతిరేకత
  • బడ్జెట్ పై కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో అసహనం
  • లిజ్ ట్రస్‌  ను గద్దె దింపి సునక్‌ కు అధికారం కట్టబెట్టేందుకు ఎంపీల ప్రయత్నాలు!
Rishi Sunak to replace UK PM Liz Truss

ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన భారత సంతతి వ్యక్తి రిషి సునక్ ను బ్రిటన్ ప్రధాన మంత్రి పీఠం వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రధాని లిజ్ ట్రస్‌ తీరు నచ్చని పార్టీ తిరుగుబాటు ఎంపీలు ఆమె స్థానంలో రిషి సునక్ ను కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దాంతో, బ్రిటన్ ప్రధాని కుర్చీ విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ట్రస్ పై తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. ఈ విషయమై ఇటీవల నిర్వహించిన ఓ పోల్ లో పార్టీలో సగం మంది తాము సరైన వ్యక్తిని ఎన్నుకోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ట్రస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్ లో పౌండ్ పతనం అవడం, తనఖా, ప్రభుత్వ రుణ వడ్డీ రేట్లు పెరగడం దీనికి కారణమైంది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సభ్యులు తమ నాయకురాలు పన్ను తగ్గించే ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ విధానం దేశంలో జీవన వ్యయ సంక్షోభానికి దారితీస్తూ, ధనవంతులకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 

ఈ క్రమంలో చట్టసభ సభ్యులు ప్రధాని ఎన్నికలలో ట్రస్ తో పోటీ పడ్డ 42 ఏళ్ల బ్రిటీష్ ఇండియన్, మాజీ ఛాన్సలర్ రిషి సునక్‌ ను తెరపైకి తెస్తున్నారు. సునక్ సైతం తన మద్దతుదారుల సపోర్ట్ తో బ్రిటన్ ప్రధాని పీఠం అందుకునే వారిలో ముందు వరుసలో ఉన్నారు. బ్రిటన్ ఎంపీలు.. సునక్, మోర్డాంట్‌ ఉమ్మడి బృందానికి మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాగా, లిజ్ శుక్రవారం తమ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్‌ను తొలగించారు. కొత్త ఆర్థిక మంత్రిగా కన్జర్వేటివ్ మాజీ అభ్యర్థి జెరెమీ హంట్‌ను నియమించారు.  

More Telugu News