Turkey: బిల్లును వ్యతిరేకిస్తూ.. టర్కీ పార్లమెంటులో స్మార్ట్‌ఫోన్‌ను సుత్తితో పగలగొట్టిన ఎంపీ

  • డిజిటల్ మాధ్యమాల్లో తప్పుడు సమాచార వ్యాప్తిని నేరంగా పరిగణించే బిల్లును ప్రవేశపెట్టిన అధ్యక్షుడు
  • బిల్లును ‘అతిపెద్ద సెన్సార్‌షిప్ చట్టం’ గా అభివర్ణించిన ప్రతిపక్ష సభ్యుడు బురాక్స్ ఎర్బే
  • ప్రజలకు ఫోన్లను పగలగొట్టడం మినహా మరో దారిలేదని స్పష్టీకరణ
  • వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరిక
Turkish parliament passes media law setting jail terms for disinformation

డిజిటల్ మాధ్యమంలో తప్పుడు సమాచార వ్యాప్తిని నేరంగా పరిగణించే బిల్లును వ్యతిరేకిస్తూ ఓ చట్ట సభ్యుడు సభలోనే స్మార్ట్‌ఫోన్‌ను సుత్తితో పగలగొట్టి నిరసన తెలిపాడు. టర్కీలో జరిగిందీ ఘటన. ఈ బిల్లును ‘అతిపెద్ద సెన్సార్‌షిప్ చట్టం’గా అభివర్ణిస్తూ టర్కీ ప్రతిపక్ష ‘రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ’కి చెందిన ఎంపీ బురాక్స్ ఎర్బే తన స్మార్ట్‌ఫోన్‌ను సభలోనే సుత్తితో పగలగొట్టారు. కమ్యూనికేట్ చేయడానికి ప్రజలకు మిగిలి ఉన్న ఒకే ఒక్క మాధ్యమాన్ని కూడా దూరం చేస్తే ప్రజలు తమ ఫోన్లను పగలగొట్టడం తప్ప మరో దారిలేదని అన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒకే ఒక్క స్వేచ్ఛ మిగిలి ఉందని, అది మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోనేనని ప్రజలను ఉద్దేశించి అన్నారు. స్మార్ట్‌ఫోన్ సాయంతో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర మాధ్యమాలను వినియోగించొచ్చని, వాటి సాయంతో ఇతరులకు కమ్యూనికేట్ చేయొచ్చని అన్నారు. అయితే, ఇప్పుడీ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే మీ ఫోన్లను పగలగొట్టడం మినహా మరో దారి ఉండదని అన్నారు. అయితే, వచ్చే ఏడాది జూన్‌లో మాత్రం అధికార పక్షానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

మరోవైపు, ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రతిపాదించిన ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినట్టు నిర్ధారణ అయితే జర్నలిస్టులు సహా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిని ఈ చట్టం కింద శిక్షిస్తారు. కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, దేనిని తప్పుడు సమాచారంగా పరిగణిస్తారన్న దానిపై బిల్లులో స్పష్టత లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం భావప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని మండిపడుతున్నాయి.

More Telugu News