Sourav Ganguly: ఒక్కరోజులో ఎవరూ అంబానీ, మోదీ అయిపోలేరు: గంగూలీ

  • బీసీసీఐ చీఫ్ గా పదవీ విరమణ చేయనున్న గంగూలీ
  • ఇక వేరే పనులు చేస్తానని వెల్లడి
  • ఆటగాడిగా, పాలకుడిగా కొనసాగడం గొప్పగా ఉందన్న దాదా
Ganguly opines in his future stints

త్వరలో బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ విరమణ చేయనున్న సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా క్రికెట్ పాలనా వ్యవహారాలు నిర్వర్తించానని, ఇక మరో రంగానికి తరలి వెళుతున్నానని తెలిపారు. ఏదేమైనా తన జీవితంలో గొప్ప సమయం అంటే టీమిండియాకు ఆడిన రోజులేనని వెల్లడించారు. 

"బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించాను, ఇక మరింత పెద్ద పనులు చేయబోతున్నాను. ఎవరూ కూడా ఎప్పటికీ ఆటగాడిగా కొనసాగలేరు, ఎవరూ కూడా ఎప్పటికీ క్రికెట్ పాలకుడిగా కొనసాగలేరు" అని వివరించారు. తాను ఆటగాడిగానూ, క్రికెట్ పాలకుడిగానూ కొనసాగడం గొప్పగా అనిపిస్తోందని గంగూలీ తెలిపారు. 

"తూర్పు రాష్ట్రాల వారు క్రికెట్ లో పెద్దగా రాణించలేరని గతంలో అనుకునేవారు. అయితే చరిత్రపై నాకు నమ్మకం లేదు. ఎవరూ కూడా ఒక్కరోజులో అంబానీ లేక నరేంద్ర మోదీ అయిపోలేరు. ఉన్నతస్థాయికి చేరాలంటే నెలలు, సంవత్సరాల తరబడి కఠోరంగా శ్రమించాల్సి ఉంటుంది" అని గంగూలీ వివరించారు. కాగా, బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా కొనసాగాలని గంగూలీ భావిస్తున్నప్పటికీ, బోర్డులోని ఇతర సభ్యుల నుంచి మద్దతు లభించడంలేదని ప్రచారం జరుగుతోంది.

More Telugu News