Andhra Pradesh: గండికోట‌లో ఒబెరాయ్ హోట‌ల్స్‌... 50 ఎక‌రాల‌ను 99 ఏళ్లపాటు లీజుకిచ్చిన ఏపీ ప్ర‌భుత్వం

ap government leased 50 ecres of land in gandikota to oberoi hotels
  • ఇటీవ‌లే గండికోటను ప‌రిశీలించిన ఒబెరాయ్ హెట‌ల్స్ ప్ర‌తినిధి బృందం
  • గండికోట‌లో 120 విల్లాల‌ను ఏర్పాటు చేయ‌నున్న ఒబెరాయ్ హోట‌ల్స్‌
  • ఇందుకోసం రూ.250 కోట్ల‌ను వెచ్చించ‌నున్న సంస్థ‌
  • లీజుపై అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప్ర‌సిద్ది చెందిన ప‌ర్యాట‌క కేంద్రం గండికోట‌కు మ‌రింత‌గా ప‌ర్యాట‌క ప్రాధాన్యం పెర‌గ‌నుంది. ఈ ప‌ర్యాట‌క కేంద్రంలో ఆతిథ్య రంగంలో దేశంలోనే పేరెన్నిగ‌న్న ఒబెరాయ్ హెట‌ల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ ఏకంగా రూ.250 కోట్ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. ఈ నిధుల‌తో గండికోట‌లో 120 విల్లాల‌ను ఆ సంస్థ నిర్మించనుంది. ఇందుకోసం ఆ సంస్థ‌కు అవ‌స‌ర‌మైన 50 ఎక‌రాల‌ను ఏపీ ప్ర‌భుత్వం 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. ఈ మేర‌కు లీజుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

గండికోట ప‌ర్యాట‌క ప్రాంతంలో హోట‌ళ్లు నిర్మించేందుకు అవ‌స‌ర‌మైన స్థ‌లాల‌ను ప‌రిశీలించేందుకు ఇటీవ‌లే ఒబెరాయ్ హెట‌ల్స్ సీఈఓ అర్జున్ సింగ్ త‌న ప్ర‌తినిధి బృందంతో క‌డ‌ప జిల్లాకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. జిల్లా అధికారుల‌తో క‌లిసి ఆయ‌న గండికోట ప్రాంతాన్ని ప‌రిశీలించారు. ఈ ప‌రిశీల‌న‌లో త‌మ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుగుణంగా ఉన్న స్థ‌లాన్ని అర్జున్ సింగ్ గుర్తించ‌గా...అదే ప్రాంతంలోని 50 ఎక‌రాల‌ను ఒబెరాయ్ సంస్థ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం లీజుకు ఇచ్చింది. గండికోట‌ను ప్ర‌పంచ ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్దాల‌న్న ల‌క్ష్యంతోనే ఈ లీజుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.
Andhra Pradesh
Gandikota
YSRCP
YS Jagan
Kadapa District
Oberoi Hotels

More Telugu News