Vande Bharat Express: వందేభారత్ శ్రేణిలో నాలుగో రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

  • భారత్ లో సెమీ హైస్పీడ్ రైళ్ల శకం
  • హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా నుంచి తాజా రైలు ప్రారంభం
  • బోగీల్లోని సౌకర్యాలను పరిశీలించిన మోదీ
  • గత వెర్షన్లతో పోల్చితే తాజా రైలులో అత్యాధునిక సదుపాయాలు
PM Modi inaugurates fourth Vande Bharat Express in Una

ప్రధాని నరేంద్ర మోదీ మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. వందేభారత్ శ్రేణిలో నాలుగో రైలును నేడు హిమాచల్ ప్రదేశ్ లోని ఉనాలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఉనాలోని అంబ్ అందౌరా స్టేషన్ నుంచి ఈ రైలు న్యూఢిల్లీ వెళుతుంది. 

ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ... వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీల్లో కలియదిరిగారు. వాటిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఉనా రైల్వే స్టేషన్ ను కూడా ఆయన తనిఖీ చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. 

కాగా, వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు వేగం దృష్ట్యా... ఉనా నుంచి ఢిల్లీకి ప్రయాణ సమయం 2 గంటలు తగ్గనుంది. దేశంలో ఇప్పటివరకు మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టగా, ఇది నాలుగోది. 

గతంలో ప్రారంభించిన రైళ్లతో పోల్చితే, ఈ కొత్త రైలు అత్యాధునికమైనది. తేలికగా ఉండడంతో స్వల్ప వ్యవధిలోనే గరిష్ఠ వేగాన్ని అందుకోగలదు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 52 సెకన్లలోనే అందుకుంటుంది. గంటకు 180 కిమీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఈ నూతన వందేభారత్ ఎక్స్ ప్రెస్ సొంతం. గతంలో ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల బరువు 430 టన్నులు కాగా, తాజా రైలు బరువు 392 టన్నులు. 

గత వెర్షన్లలో 24 అంగుళాల ఇన్ఫోటైన్ స్క్రీన్లు ఏర్పాటు చేయగా, ఇందులో 32 అంగుళాల స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, గత వెర్షన్లలో సీట్లను పక్కకి కూడా తిప్పుకుని కూర్చునే సౌలభ్యం (సైడ్ రిక్లైనింగ్ సీట్లు) కేవలం ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీల్లోనే ఉండగా, తాజా రైలులో అన్ని బోగీల్లోనూ ఈ సదుపాయం కల్పించారు. తద్వారా ప్రయాణికులు కిటీకీకి అభిముఖంగా కూర్చుని ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. 

కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మూడో వందేభారత్ రైలు పలు సమస్యలు ఎదుర్కొనడం తెలిసిందే. తొలిరోజునే గేదెలను ఢీకొట్టిన ఈ రైలు, మరుసటి రోజు ఆవును ఢీకొట్టగా, మూడో రోజు చక్రం బిగుసుకుపోవడంతో నిలిచిపోయింది.

More Telugu News