Telangana: రాజీనామాతోనే ప్ర‌జ‌ల‌కు అన్నీ వ‌స్తాయ‌ని చెప్పా.. నా మాట మేర‌కే రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేశారు: ఈట‌ల రాజేంద‌ర్‌

etela rajender participates in munigode bypoll campaign with komatireddy rajgopal reddy
  • చౌటుప్ప‌ల్‌లో రాజ‌గోపాల్ రెడ్డితో క‌లిసి ప్ర‌చారంలో పాల్గొన్న ఈట‌ల‌
  • బెల్ట్ షాపుల కార‌ణంగా మ‌హిళ‌లు చిన్న వ‌య‌సులోనే భ‌ర్త‌ల‌ను కోల్పోతున్నార‌ని ఆవేద‌న‌
  • ఇప్పటి  తెలంగాణ‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకోలేద‌న్న హుజూరాబాద్ ఎమ్మెల్యే
మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడు ప‌రిధిలోని చౌటుప్ప‌ల్‌లో బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డితో క‌లిసి ఈట‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజ‌గోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశార‌న్న విష‌యాన్ని ఈట‌ల వెల్ల‌డించారు. అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌ని, కేవ‌లం రాజీనామాతోనే ప్ర‌జ‌ల‌కు కావాల్సిన‌వ‌న్నీ వ‌స్తాయ‌ని రాజ‌గోపాల్ రెడ్డికి చెప్పాన‌ని ఆయ‌న అన్నారు. త‌న మాట మేర‌కే రాజ‌గోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని ఆయ‌న చెప్పారు.

తెలంగాణ‌లో బెల్ట్ షాపులు విచ్చ‌ల‌విడిగా వెలిశాయ‌ని ఈట‌ల ఆరోపించారు. ఈ బెల్ట్ షాపుల కార‌ణంగానే మ‌హిళ‌లు చిన్న వ‌య‌సులోనే త‌మ భ‌ర్త‌ల‌ను కోల్పోతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌ద్యంపై వ‌చ్చే ఆదాయంపై ప్ర‌భుత్వం ఆధార‌ప‌డ‌టం సిగ్గుచేట‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడున్న తెలంగాణ‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకోలేద‌ని కూడా ఈట‌ల అన్నారు. త‌న‌ను త‌న గ్రామానికి కూడా రాకుండా అడ్డుకున్నార‌న్న ఈట‌ల‌... అందుకు అధికారులు కూడా సాయప‌డ్డార‌ని ఆరోపించారు. ఇలాంటి అధికారుల‌పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు ఈట‌ల చెప్పారు.
Telangana
BJP
Etela Rajender
Komatireddy Raj Gopal Reddy
Munugode

More Telugu News