టెలికాం రంగంలోకి అదానీ.. మంజూరైన లైసెన్సులు!

  • భారత్ లో టెలికాం సేవలకు లైసెన్స్ పొందిన అదానీ గ్రూప్
  • ఇటీవల నిర్వహించిన 5జీ వేలంలో పాల్గొన్న అదానీ సంస్థ
  • సొంత అవసరాల కోసమే కొన్నట్లు చెబుతున్న కంపెనీ
Adani Group receives licence to offer telecom services in India

భారత కుబేరుడు గౌతమ్ అదానీ మరో రంగంలోకి అడుగు పెడుతున్నారు. దేశంలో పూర్తి స్థాయి టెలికాం సర్వీసులు అందించేందుకు అదానీ గ్రూప్ లైసెన్స్ పొందినట్టు తెలుస్తోంది. ఈ వార్త ఈ రంగంలో ఇప్పటిదాకా అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ కంపెనీల్లో వణుకు పుట్టిస్తోంది. గౌతమ్ అదానీ గ్రూప్ ఇటీవల నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంది. అదానీ డేటా నెట్‌వర్క్‌లకు యూఎల్ (ఏఎస్) మంజూరు అయిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సోమవారమే అనుమతి లభించినట్లు వెల్లడించాయి. అయితే, జియో, ఎయిర్‌టెల్‌ లకు పోటీగా తమ టెలికాం నెట్‌వర్క్‌ను పరిచయం చేసే విషయంపై అదానీ గ్రూప్ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. 

తాము రిటైల్ టెలికాం సేవలను అందించాలని భావించడం లేదని, తమ ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌ను సెటప్ చేయడానికి స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినట్లు ఇది వరకు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్నాటక, రాజస్థాన్, తమిళనాడు, ముంబై వంటి ఆరు సర్కిళ్లలో మాత్రమే అదానీ డేటా నెట్‌వర్క్స్.. భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ నుంచి లైసెన్స్‌ను పొందిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దాని వల్ల అదానీ కంపెనీ తన నెట్‌వర్క్‌లో సుదూర కాల్స్ చేయడంతో పాటు, ఇంటర్నెట్ సేవలను కూడా అందించడానికి అర్హత పొందింది.

కాగా, అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్ (ఏడీఎన్ఎల్) 26 గిగా హెర్ట్జ్ మిల్లీ మీటర్ వేవ్ బ్యాండ్‌లో 400 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను 20 సంవత్సరాల పాటు ఉపయోగించుకునే హక్కును రూ. 212 కోట్లకు సొంతం చేసుకుంది. దీన్ని తమ డేటా సెంటర్‌లకు... అలాగే, తమ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్, ఎయిర్ పోర్టులు, గ్యాస్ రీటెయిలింగ్, పోర్టులు తదితర వ్యాపార కార్యకలాపాల కోసం ఏర్పాటు చేయబోయే సూపర్ యాప్‌ ల నిర్వహణకు ఉపయోగించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపింది.

More Telugu News