Justice DY Chandrachud: సుప్రీంకోర్టు చరిత్రలో తండ్రీకొడుకుల అరుదైన ఘనత!

  • తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్
  • గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా చంద్రచూడ్ తండ్రి
  • సీజేఐ పదవి వరకు వచ్చిన తండ్రీకొడుకులు వీరే!
  • 1978లో సీజేఐగా వైవీ చంద్రచూడ్ 
Justice DY Chandrachud and his father owns rare instance of CJI post

సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  యూయూ లలిత్ పదవీకాలం నవంబరు 8వ తేదీతో ముగియనుండగా, నూతన సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టుకు 50వ ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు. ఈ క్రమంలో చంద్రచూడ్ ఫ్యామిలీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 

డీవై చంద్రచూడ్ తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా గతంలో సీజేఐ పదవిని అధిష్ఠించారు. 1978లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ చంద్రచూడ్ 1985లో పదవీవిరమణ చేశారు. 

ఆయన తన పదవీకాలంలో ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీకి 'కిస్సా కుర్సీ కా' అనే సినిమా విషయంలో జైలుశిక్ష విధించారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరగాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీలపై ఈ సినిమా ఓ రాజకీయ సెటైర్ గా గుర్తింపు పొందింది. ఈ సినిమాను ఇందిర ప్రభుత్వం నిషేధించింది. ఇదే కాకుండా, అనేక కీలక కేసుల్లోనూ వైవీ చంద్రచూడ్ తీర్పులు ఇచ్చారు. 

ఇప్పుడు ఆయన కుమారుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజేఐ కానున్నారు. ఇలా సీజేఐ పదవి వరకు వచ్చిన తండ్రీకొడుకులు భారత న్యాయవ్యవస్థలో వీరిద్దరే. డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా 2024 నవంబరు 10వ తేదీ వరకు పదవిలో కొనసాగనున్నారు. కాగా, సుప్రీంకోర్టు జడ్జి హోదాలో డీవై చంద్రచూడ్... గతంలో తన తండ్రి ఇచ్చిన రెండు తీర్పులను కొట్టివేశారు. 

డీవై చంద్రచూడ్ తండ్రి బాటలోనే న్యాయవాద వృత్తిని ఎంచుకుని అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి రెండు డిగ్రీలు అందుకున్నారు. 39 ఏళ్ల వయసులో సీనియర్ అడ్వొకేట్ గా నియమితుడైన అతి పిన్న వయస్కుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 1998లో ఆయన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. 

న్యాయవాదిగా కొనసాగుతున్న సమయంలో డీవై చంద్రచూడ్ ఓక్లహామా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పాఠాలు బోధించారు. బాంబే యూనివర్సిటీలో 1988-1997 మధ్య విజిటింగ్ ప్రొఫెసర్ గానూ వ్యవహరించారు. 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు జడ్జిగా నియమితుడై ఆ పదవిలో 13 ఏళ్ల పాటు కొనసాగారు. 2013లో ఆయనకు పదోన్నతి లభించింది. అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు.

More Telugu News