మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల మ‌ధ్య చీక‌టి ఒప్పందం: జ‌గ్గారెడ్డి

  • మోదీ, కేసీఆర్ స్థాయిలోనే చీక‌టి ఒప్పంద‌మ‌న్న జ‌గ్గారెడ్డి
  • రెండు పార్టీలు రూ.100 కోట్ల‌తో వ‌స్తున్నాయ‌ని ఆరోప‌ణ‌
  • బీజేపీ, టీఆర్ఎస్ ఇచ్చే డ‌బ్బులు తీసుకుని ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయాల‌ని పిలుపు
jaggareddy fires on trs and bjp pver munugode bypolls

మునుగోడు ఉప ఎన్నిక‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య చీక‌టి ఒప్పందం కుదిరింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఆ రెండు పార్టీలు క‌లిసి...కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాల‌ని కుట్ర‌లు ప‌న్నుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు దాదాపుగా రూ.100 కోట్ల‌తో ఉప ఎన్నిక‌ల‌కు వెళుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ స్థాయిలోనే ఆ రెండు పార్టీల మ‌ధ్య చీక‌టి ఒప్పందం కుదిరింద‌ని ఆయ‌న ఆరోపించారు. 

ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ ఇచ్చే డ‌బ్బులు తీసుకోవాల‌ని...ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయాల‌ని మునుగోడు ఓటర్ల‌కు జ‌గ్గారెడ్డి పిలుపునిచ్చారు. డ‌బ్బుతో ఓట్ల‌ను కొనుగోలు చేయ‌లేర‌న్న విష‌యం ఆ రెండు పార్టీల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌ని ఆయ‌న కోరారు. ఇక మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఎవ‌రు రాకున్నా కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. త‌న సోద‌రుడు ప్ర‌త్య‌ర్థి పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నందున తాను ప్ర‌చారానికి వెళ్ల‌లేన‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పార్టీ అధిష్ఠానానికి తెలియ‌జేశార‌ని, అయితే అందుకు అధిష్ఠానం ఒప్పుకుందో, లేదో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం ద‌హ‌నం వెనుక టీఆర్ఎస్‌, బీజేపీల హ‌స్తం ఉంద‌ని జ‌గ్గారెడ్డి ఆరోపించారు.

More Telugu News