VH: ఇవాళ చండూరు ఘటన జరిగింది... రేపు మా కార్యకర్తలను చంపినా అడిగేవారెవ్వరు?: వీహెచ్

  • చండూరులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మంటలు
  • ప్రమాదం కాదంటున్న కాంగ్రెస్ నేతలు
  • ప్రత్యర్థి పార్టీల కుట్ర అని ఆరోపణ
  • ఈ ఘటనను తేలిగ్గా తీసుకోరాదన్న వీహెచ్
VH fires on Chanduru incident

మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మంటల్లో చిక్కుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చండూరులో ఇవాళ రేవంత్ రెడ్డి సభ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, కచ్చితంగా ప్రత్యర్థి పార్టీల చర్యేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ ఘటనపై స్పందించారు. 

ఈ ఘటనను ఉపేక్షించరాదని, ఇవాళ ఈ ఘటన జరిగింది, రేపు మరొకటి జరుగుతుంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని కూడా వదిలేసి తాడోపేడో తేల్చుకోవడానికి కూర్చున్నారని వెల్లడించారు. ఎందుకంటే, ఈ ఘటనను తేలిగ్గా వదిలిస్తే, రేపు తమ కార్యకర్తలను చంపేసినా అడిగేవారెవ్వరు? అని వీహెచ్ వ్యాఖ్యానించారు.

చండూరు ఘటనపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారకులను శిక్షించాలని, లేకపోతే తాము ధర్నా చేపట్టాల్సి ఉంటుందని వీహెచ్ హెచ్చరించారు.

More Telugu News