Andhra Pradesh: రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్యమే!... బీఆర్ఎస్‌పై కొడాలి నాని కామెంట్‌!

  • ఏపీలో బీఆర్ఎస్ మ‌నుగ‌డ‌కు కాల‌మే స‌మాధానం చెప్పాల‌న్న నాని
  • కేసీఆర్ ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నారేమోన‌ని వ్యాఖ్య‌
  • ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు మ‌ద్ద‌తుంటే చాలున‌ని వ్యంగ్యం
  • 200 ఏళ్లు అయినా అమ‌రావతి నిర్మాణం పూర్తి కాద‌ని వెల్ల‌డి
  • క‌మ్మ కుల ఉగ్ర‌వాదుల ఆధ్వ‌ర్యంలోనే అమ‌రావ‌తి రైతుల యాత్ర అని అరోప‌ణ‌
ysrcp mla kodali nani viral comments on brs future and tdp leaders

జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తూ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణ‌యం, ఏపీలో బీఆర్ఎస్ ప్ర‌భావం, తదితర అంశాలపై వైసీపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి కొడాలి నాని సోమ‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

ఏపీలో బీఆర్ఎస్ మ‌నుగ‌డ‌కు కాల‌మే స‌మాధానం చెప్పాల‌న్న కొడాలి నాని... రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మేన‌ని వ్యాఖ్యానించారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న... రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్ ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నారేమోన‌ని కూడా వ్యాఖ్యానించారు.

ఇక అమ‌రావతి ఉద్య‌మం, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ నేత‌లు త‌న‌పై చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ప్రస్తావించిన నాని... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆయ‌న సోద‌రుడు చిరంజీవి మ‌ద్ద‌తు అవ‌స‌రం రాక‌పోవ‌చ్చ‌న్న నాని... 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు మ‌ద్దతు ఉంటే చాల‌ని అన్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు చెబుతున్న‌దంతా ఒట్టి ట్రాష్ అన్న నాని... 200 ఏళ్లు అయినా అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి కాద‌ని అన్నారు. 

అనంత‌రం త‌న సొంత కులానికి చెందిన టీడీపీ నేత‌లు త‌నపై చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించిన నాని... మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమాయ‌కులైన అమ‌రావ‌తి రైతుల ముసుగులో క‌మ్మ కుల ఉగ్ర‌వాదులు చేస్తున్న‌దే పాద‌యాత్ర అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఓడిపోయిన 10 మంది క‌మ్మ టీడీపీ నేత‌లు త‌న‌ను కుల బ‌హిష్క‌రణ చేయ‌డానికి గుడివాడ‌లో తొడ‌లు కొట్టారంటూ ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

More Telugu News