breakfast: చక్కని ఆరోగ్యానికి మంచి బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు

  • ఉదయం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాలి
  • ప్రొటీన్, పోషకాలతో ఉంటే ఆరోగ్యానికి మంచిది
  • గుడ్లు, హోల్ వీట్, ఓట్ మీల్, పండ్లు మంచి ఆప్షన్లు
Good breakfast ideas to help you live longer and healthier

ఆరోగ్య భాగ్యం ఉంటే చాలు.. అని అనుకునే కాలంలో ఉన్నాం. మనిషి సగటు ఆయుర్ధాయం పెరిగినప్పటికీ.. అదేమంత సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఎన్నో అనారోగ్య సమస్యలు దీనికి కారణం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో వచ్చిన మార్పులు ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలకు బదులు, హానిచేసే వాటి వినియోగం పెరుగుతోంది. ఈ తరుణంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ఆరోగ్యకరమైన వాటిని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


చాలా మంది బ్రేక్ ఫాస్ట్ కు ప్రాధాన్యం ఇవ్వరు. ఉదయం తీసుకునే ఆహారం పాత్ర ఆరోగ్యంపై ఎంతో ఉంటుంది. ఫైబర్ తో కూడిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు తిరిగి ఆకలి అవకుండా ఉంటుంది. తగినంత ప్రొటీన్లు, ఫ్యాట్స్, పోషకాలు బ్రేక్ ఫాస్ట్ లో ఉండాలి. అధిక కార్బోహైడ్రేట్స్ తో కూడిన వాటిని తీసుకోకూడదు. వీటివల్ల తిన్నది వేగంగా జీర్ణమై, రక్తంలోకి అధిక గ్లూకోజ్ చేరిపోతుంది. దీర్ఘకాలంలో ఇది మధుమేహం, ఇతర సమస్యలకు దారితీస్తుంది.

గుడ్లు
వయసుతో సంబంధం లేకుండా కోడి గుడ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు. ఉదయం బాయిల్ చేసిన గుడ్డు తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. లేదంటే ఆమ్లెట్ వేసుకుని అయినా తీసుకోవచ్చు.

ఓట్ మీల్
ఓట్స్ లో ఫైబర్ పుష్కలం. ఐరన్, బీ విటమిన్లు, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం లభిస్తాయి. పోషకాలు, ఫైబర్ తగినంత ఉన్న ఓట్స్ ను ఉదయం తీసుకుంటే ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు.

కాయగూరల సలాడ్
ఆకు కూరలు, కాయగూరలను సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల తగినన్ని విటమిన్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రొటీన్ లభిస్తాయి. అంతేకాదు, సహజ ఫైబర్ కూడా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

హోల్ వీట్ టోస్ట్
ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ (ఒకేసారి విడుదల కాని) ఉన్న హోల్ వీట్ టోస్ట్ ను తీసుకోవడం వల్ల రక్తంలోకి ఒకేసారి అధిక మోతాదులో గ్లూకోజ్ చేరకుండా ఉంటుంది. దీంతో రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుంది. 

పండ్లు
ఉదయం అల్పాహారంగా పండ్లను కూడా తినొచ్చు. ఫ్రూట్ సలాడ్ గానూ తీసుకోవచ్చు. కాకపోతే ఫైబర్ ఉండే పండ్లకు చోటు ఇవ్వాలి.

More Telugu News