Chandrababu: దేవిక హత్య విషయంలో దిశ చట్టం ప్రకారం చర్యలు అంటూ సీఎం ప్రకటనలు చేయడం మోసగించడమే: చంద్రబాబు

Chandrababu criticizes CM Jagan over Devika murder
  • కాకినాడ జిల్లాలో విద్యార్థిని హత్య
  • దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్
  • ఉత్తుత్తి ప్రకటనలు మానుకోవాలన్న చంద్రబాబు
  • మహిళల్లో నమ్మకం కలిగేలా వ్యవహరించాలని హితవు

కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో గుబ్బల దేవిక అనే డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఓ యువకుడి చేతిలో హత్యకు గురైన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్, నిందితుడిపై దిశం చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రకటనలకే పరిమితం అవుతోందని విమర్శించారు. కాకినాడలో దేవిక హత్య విషయంలో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ స్వయంగా సీఎం ప్రకటనలు చేయడం మోసగించడమేనని స్పష్టం చేశారు. 

సీఎం, ప్రభుత్వం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలు మాని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని, అప్పుడే నేరస్తులకు భయం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. తద్వారా మహిళలకు నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. 

కొత్త చట్టాలు కాదు... కనీసం ఉన్న చట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసుపెట్టిన వివాహిత ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని చంద్రబాబు వెల్లడించారు. మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం ఎంత అలసత్వంతో ఉందో అర్థమవుతోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News