World Meningitis Day: మెనింజైటిస్.. ఈ మహమ్మారి నుంచి చిన్నారులను రక్షించుకునే మార్గం టీకాయే

  • దీని కారణంగా పిల్లల్లో మరణాల రేటు ఎక్కువ
  • ఇన్ఫెక్షన్ సోకితే రెండు రోజుల్లోనే సీరియస్ అయ్యే ప్రమాదం
  • టీకాతో పాటు పరిశుభ్రమైన అలవాట్లతో పిల్లలకు రక్షణ
Parents should consider protecting their children from meningitis World Meningitis Day

మెనింజైటిస్ అన్నది చిన్నారులకు సోకే మహమ్మారి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ మహమ్మారి నుంచి రక్షణ కోసం టీకా ఇప్పించుకోవడం శ్రేయస్కరం. నేడు ప్రపంచ మెనింజైటిస్ డే. కనుక దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరం. 

మెనింజైటిస్ వ్యాధిలో మెదడులోని మెంబ్రేన్ల కు వాపు వస్తుంది. మెదడు, వెన్నెముకలో ఉండే రక్షిత పొరలు ఇవి. ఇన్ఫెక్షన్ కారణంగా మెదడు, వెన్నెముకలో నీరు చేరుతుంది. ఇది వాపునకు దారితీస్తుంది. బ్యాక్టీరియా, ఫంగి, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల మెనింజైటిస్ సమస్య తలెత్తుతుంది. బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెనింజైటిస్ ఎక్కువ అని చెప్పుకోవాలి.

ఇన్ఫెక్షన్ బారిన పడిన మొదటి 8 గంటల్లోనే శ్వాసకోశ అనారోగ్యం లేదా గొంతులో మంట, జ్వరం, చలి, తల తిరగడం, వాంతులు కనిపిస్తాయి. ఆ తర్వాత 8 గంటల్లో చర్మంపై లేత ఎరుపు రంగు ర్యాషెస్ కనిపిస్తాయి. మెడ పట్టేయడం, లైట్ ను చూడలేకపోవడం గమనించొచ్చు. ఆ తర్వాత ఎనిమిది గంటల్లోనే సెప్సిస్ వచ్చి (రక్తంలో ఇన్ఫెక్షన్) ప్రధాన అవయవాలు ఒక్కోటిగా వైఫల్యం పాలవుతూ మరణం చోటు చేసుకుంటుంది.

జాగ్రత్తగా ఉండాల్సిందే..
పిల్లలకు సమస్య వస్తే అది ఏంటన్నది తెలుసుకోవడం కష్టమైన పని. అందుకే వెంటనే (తొలి 24 గంటల్లోనే) వైద్యులను సంప్రదించడమే మెరుగైన మార్గం అవుతుంది. ముఖ్యంగా మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ కోసం పిల్లలకు టీకా ఇప్పించుకోవాలి. అధిక మరణాల రేటు ఉన్న మెనింగోకొక్కల్ మెనింజైటిస్ కు టీకా ఇప్పించుకోవడం ప్రభావవంతమైనదిగా చెన్నైకి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ బాలసుబ్రమణ్యం సూచిస్తున్నారు.

ఇతర జాగ్రత్తలు
కేవలం టీకా ఇప్పించడంతో సరిపుచ్చకుండా, పిల్లలకు పరిశుభ్రమైన చర్యలు అలవాటు చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, కళ్లు, ముక్కు, నోరు, చెవులను తాకకపోవడం, తాము తాగే వాటర్ బాటిల్, పాత్రలు, టవల్ ను ఇతరులతో పంచుకోకుండా చూడాలని కోరుతున్నారు.

More Telugu News