Hindupur: హిందూపురంలో దారుణ హత్య.. వైసీపీ అసమ్మతి నేతను దారుణంగా నరికి చంపిన దుండగులు

YCP Leader killed in Hindupur Andhrapradesh
  • ఇంటి వద్ద మాటువేసిన దుండగులు
  • కారు దిగీదిగగానే కారం చల్లి వేటకొడవళ్లతో దాడి
  • మొత్తం 18 చోట్ల నరికిన దుండగులు
  • ఎమ్మెల్సీ ఇక్బాల్, హిందూపురం రూరల్ సీఐ‌పై బాధితుడి తల్లి ఆరోపణలు
హిందూపురం నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి (46) గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. రామకృష్ణారెడ్డి తన స్వగ్రామమైన చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద దాబా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి దాబా మూసేసి కారులో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు రామకృష్ణారెడ్డి కారు దిగడంతోనే ఆయన కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. మొత్తం 18 చోట్ల విచక్షణ రహితంగా నరికి పరారయ్యారు. 

రక్తపు మడుగులో పడిన ఆయనను స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణారెడ్డిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారు. మాస్కులు ధరించిన ఐదుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చారని, ఇద్దరు దుండగులు బైక్‌పైనే ఉండగా మిగతా ముగ్గురు రామకృష్ణారెడ్డిపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

తన కుమారుడి హత్య వెనక ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన పీఏ గోపీకృష్ణ, చౌళూరు రవికుమార్, హిందూపురం రూరల్ సీఐ ఉన్నారని రామకృష్ణారెడ్డి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఆరోపించారు. రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వర్గీయులకు ఇటీవల వివాదం జరిగిందని, ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపులు కూడా వచ్చాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్య జరగడం అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. రామకృష్ణారెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన తాత రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Hindupur
YSRCP
YCP Leader
Murder
Andhra Pradesh

More Telugu News