Chiranjeevi: ఇంద్ర .. ఠాగూర్ రేంజ్ సినిమా 'గాడ్ ఫాదర్' : చిరూ

  • 'గాడ్ ఫాదర్' బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో చిరూ 
  • రిలీజ్ కి ముందు నిద్రపట్టలేదన్న మెగాస్టార్ 
  • కంటెంట్ ఉంటే జనాలు వస్తారనే నమ్మకం నిజమైందంటూ వ్యాఖ్య 
  • ఈ విజయం సమష్ఠి కృషి అంటూ వెల్లడి
God Father Movie Success Meet

'గాడ్ ఫాదర్' గా చిరంజీవి ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తొలి షోతోనే ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చేసుకుంది. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ ..  " ఈ సినిమా రిలీజ్ కి ముందు రోజున నా కంటే ఎక్కువగా సురేఖ టెన్షన్ పడింది. ఆమె కంగారు చూసి నాకు కూడా నిద్ర పట్టలేదు. ఎన్ని సినిమాలు చేసినా, ప్రతి సినిమా ప్రాణం పెట్టి చేయడం వలన అలా అనిపించడం సహజం.

ఇది 'ఇంద్ర' .. 'ఠాగూర్' రేంజ్ సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ రాగానే, అప్పుడు నాకు అలసట తెలిసింది. ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ను ఈ సినిమా మాకు ఇచ్చింది. కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకు వస్తారనే నా నమ్మకం ఈ సినిమా విషయంలోను నిజమైంది. లేడీస్ కూడా ఈ సినిమాకి వస్తున్నారని విన్నాను .. నిజంగా ఇది ఒక శుభసూచకం. నేను ఈ సినిమా చేయడానికి కారకుడు చరణ్ .. తను ఒప్పించడం వల్లనే ఓకే  చెప్పాను. చరణ్ వల్లనే సల్మాన్ స్పెషల్ రోల్ చేయానికి ఒప్పుకున్నాడు. పారితోషికం ఇవ్వడానికి వెళ్లిన మేనేజర్ ను తిట్టేసి పంపించాడు.

షూటింగు పూర్తయిన తరువాత క్లైమాక్స్ మార్చుకుని .. రీ షూట్ చేయడం జరిగింది. అదీ పదీ పదిహేను రోజుల క్రితమే. అది ఇప్పుడు ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఈ రోజున ఈ సినిమాకి వచ్చిన క్రెడిట్ టీమ్ లోని అందరికీ చెందుతుంది. అందరూ కూడా ఇది తమ సొంత సినిమా అనుకుని చేశారు గనుకనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఊపు లేదంటూ రాసుకొచ్చిన మీడియానే ఆ తరువాత సినిమా బాగుందంటూ మంచి రేటింగ్ ఇచ్చింది. అందుకు అందరికీ ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News