Devaki: కాకినాడ జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్

  • కాండ్రేగుల కూరాడలో ప్రేమోన్మాది ఘాతుకం
  • ప్రేమ పేరుతో యువతికి వేధింపులు
  • ప్రేమించలేదని కత్తితో దాడి
  • అక్కడిక్కడే మరణించిన యువతి
  • దిశ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్
CM Jagan responds to woman murder in Kakinada district

కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో గుబ్బల దేవిక అనే యువతి ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయింది. కూరాడ గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న దేవిక డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని. అదే గ్రామానికి చెందిన వెంకట సూర్యనారాయణ ప్రేమ పేరుతో దేవికను వేధించేవాడు. 

ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేయగా, ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడు వెంకట సూర్యనారాయణను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

దిశ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చట్టంలో పేర్కొన్న విధంగా త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేసి, నిర్ణీత సమయంలోగా చార్జిషీటు దాఖలు చేయాలని స్పష్టం చేశారు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కేసుల విషయంలో దిశ చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని నిర్దేశించారు. తద్వారా, నేరానికి పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అటు, యువతి కుటుంబానికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

More Telugu News