Telangana: రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ ప‌క్షం బీజేపీలో విలీనం కాబోతోంది: రేవంత్ రెడ్డి

  • మునుగోడు ఉప ఎన్నిక‌పై మీడియా స‌మావేశంలో రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్‌కు ఏడుగురు ఎంపీలు ఉన్నార‌ని వెల్ల‌డి
  • వారిలో న‌లుగురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌
  • మ‌రో ఎంపీని క‌లుపుకుని టీఆర్ఎస్ ప‌క్షాన్ని బీజేపీలో విలీనం చేయ‌నున్నార‌న్న రేవంత్‌
  • మిగిలిన ముగ్గురు ఎంపీల పేర్ల‌నూ ప్ర‌క‌టించిన వైనం
tpcc chief revanth reddy sensational comments on trs rajyasabha mps

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ‌ (టీపీసీసీ) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి శనివారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడు ఎన్నిక‌ల‌పై శ‌నివారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో భాగంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ ప‌క్షం మొత్తంగా బీజేపీలో విలీనం కాబోతోంద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి మొత్తం తతంగం పూర్తి అయ్యింద‌ని, అతి త్వ‌ర‌లోనే ఈ ప‌రిణామం జ‌రిగి తీరుతుంద‌ని ఆయ‌న చెప్పారు. 

ప్రస్తుతం రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్‌కు ఏడుగురు స‌భ్యులు ఉన్నార‌ని చెప్పిన రేవంత్ రెడ్డి... వారిలో ఇప్ప‌టికే న‌లుగురు ఎంపీలు బీజేపీలో చేరిపోయేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ని తెలిపారు. ఇక మిగిలిన ముగ్గురు స‌భ్యుల్లో కేవ‌లం ఒక్క‌రు మాత్రం ఈ న‌లుగురితో క‌లిస్తే... మొత్తంగా రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ ప‌క్షాన్ని బీజేపీలో విలీనం చేసేందుకు య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. బీజేపీలో చేరిపోయేందుకు సిద్ధప‌డ్డ న‌లుగురు ఎంపీల పేర్ల‌ను రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించ‌కున్నా... మిగిలిన ముగ్గురి పేర్ల‌ను మాత్రం ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. కె.కేశ‌వ‌రావు, కేఆర్ సురేశ్ రెడ్డి, బ‌డుగు లింగ‌య్య‌లు మిగిలిన ముగ్గురు ఎంపీల‌ని తెలిపారు. వీరిలో ఎవ‌రో ఒక‌రిని త‌మ‌వైపున‌కు తిప్పుకునేందుకు ఆ న‌లుగురు ఎంపీలు య‌త్నాలు సాగిస్తున్నార‌ని తెలిపారు. 

ఈ మంత్రాంగం వెనుక టీఆర్ఎస్ అధిష్ఠానం ఉందేమోన‌ని కూడా ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ అధికారిక నివాసంలో ఉండి బాగా ఎదిగి ఇటీవ‌లే బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ ఎంపీ ఆధ్వ‌ర్యంలోనే ఇదంతా జ‌రుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు. రాజ‌కీయ ప‌రిణామాల‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా తాను చెప్పిన ప్ర‌తి మాట జ‌రిగింద‌న్న‌ రేవంత్‌... రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ ప‌క్షం బీజేపీలో విలీనం కావ‌డం కూడా జ‌రిగి తీరుతుంద‌ని చెప్పారు.

More Telugu News